ఒక్క దెబ్బకు మూడు పిట్టలు.. ఆర్‌ఆర్ఆర్ కేసులో టీవీ5, ఏబీఎన్ కూడా..?
వైకాపా రెబల్ పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు అలియాస్ ఆర్ఆర్‌ఆర్ ను ఏసీబీ పోలీసులు నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. రోడ్డు మార్గంలో ఆయన్ను పోలీసులు గుంటూరు తీసుకు వెళ్లారు. నిన్న రాత్రి నుండి ఏసీబీ పోలీసులు ఆయన్ను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా వ్యాక్యలు చేయడంతో పాటు మతం కులం పేరుతో ఎందుకు మీరు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించడంతో పాటు పలు విషయాలపై ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన చెప్పిన సమాధానాలు రెండు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ కేసులో ఇరుక్కునేలా చేశాయంటూ సమాచారం అందుతోంది.
టీవీ5, ఏబీఎన్ లపై కేసు…
రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలు ఎక్కువగా టీవీ5 మరియు ఏబీఎన్ ఛానెల్స్ లో ప్రసారం అయ్యాయి. ఆ రెండు ఛానెల్స్ ఈయన్ను రెచ్చగొట్టి ఆ వ్యాఖ్యలు చేసేలా చేశాయని ఏసీబీ భావిస్తుంది. ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. వారు రెచ్చ గొట్టడం వల్లే తాను మరీ అంతగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మరియు వైకాపా నాయకులను రఘురామ కృష్ణం రాజు విమర్శించడంలో ఆ రెండు మీడియా ఛానెల్స్ ప్రోద్బలం ఉందని నిర్థారణకు వచ్చారు. అందుకే ఆ రెండు ఛానెల్స్ పై కూడా ఏసీబీ కేసును నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఆ రెండు ఛానెల్స్ కు సంబంధించిన ప్రతినిధులను ఇప్పటికే అరెస్ట్ చేసేందుకు సిద్దం అయ్యారనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు..
వైకాపాకు కొరకరాని కొయ్యగా మారిన రఘురామ కృష్ణం రాజు ను ఎలాగైనా నోరు మూయించాలని గత కొన్నాళ్లుగా అధికార పక్షం నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో తమకు వ్యతిరేకంగా పదే పదే కథనాలు ప్రసారం చేస్తున్న టీవీ5 మరియు ఏబీఎన్ ఛానెల్స్ ను కూడా నోరు మూయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రఘురామ కృష్ణం రాజు రూపంలో ప్రభుత్వంకు గట్టి ఆయుదం లభించింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శిక్షలు పడటం తర్వాత సంగతి కాని తమ మీద బురద జల్లే వ్యాఖ్యలు చేసే వారికి తమకు వ్యతిరేకంగా కథనాలు రాసే వారికి ఇదో భయంగా నిలుస్తుందని అధికార పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.