తెలంగాణ లో అఖిలప్రియ కేసులో ట్విస్ట్ .. ఆందోళన లో ఆళ్లగడ్డ ప్రజలు
ఏపీతో పాటు తెలంగాణలోనూ సంచలనం సృష్టించింది బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అవడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. హైదరాబాద్ కు సమీపంలోని హఫీజ్ పేటలో ఉన్న ల్యాండ్ విషయమై ఈ ఘటన చోటు చేసుకున్నది. అక్కడ సర్వే నెంబర్ 80లో 25 ఎకరాలను బాధితులు తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఆ భూమి తమది అంటూ భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్, మరో నిందితుడు సుబ్బారెడ్డి వాదిస్తుండటంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేలా లేదు. దీనిపై ఇప్పటికే సుబ్బారెడ్డి, బాధితుడు ప్రవీణ్ రావు మధ్య ఒప్పందం కుదిరిందట. కానీ.. ఈమధ్య రియల్ ఎస్టేట్ ఊపు మీద ఉండటం.. భూమి ధరలకు రెక్కలు రావడంతో… సుబ్బారెడ్డి మళ్లీ సమస్యలు సృష్టించినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో ముందు ఏ1గా సుబ్బారెడ్డి, ఏ2 గా అఖిలప్రియ, ఏ3గా తన భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు చేర్చారు. తాజాగా ఏ2 గా ఉన్న అఖిల ప్రియను ప్రస్తుతం ఏ1గా పోలీసులు మార్చారు. ఏ1గా ఉన్న సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు.
పరారిలో అఖిలప్రియ భర్త
ప్రస్తుతం అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పరారిలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను వెతికి పట్టుకునేందదుకు పోలీసుల ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి.