Andhra Pradesh : అసలు వినాయక చవితితో రాజకీయం చేసేది ఎవరు? ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు?
Andhra Pradesh వినాయక చవితి వేడుకలపై రాష్ట్రంలో కొనసాగుతున్న రభస నేపథ్యంలో తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. వినాయక చవితి పండుగ పై టీడీపీ, బీజేపీ నేతలు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కొడాలి నాని రివర్స్ ఎటాక్ చేశారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లోనూ అవే నిబంధనలు ఉన్నాయని కొడాలి నాని స్పష్టం చేశారు. కావాలని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాల పట్ల గౌరవం ఉందని, అందరి మతవిశ్వాసాలను ఆయన గౌరవిస్తారని కొడాలి నాని పేర్కొన్నారు.
ఏపీలో అడ్రస్ లేని బీజేపీ కూడా రాజకీయ చేస్తోందంటూ, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోంది అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. సోము వీర్రాజు కి విగ్రహాలతోనూ, వినాయకచవితి తోనూ రాజకీయం చేయడం అలవాటు అంటూ కొడాలి నాని విమర్శించారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నారా లోకేష్ ని టార్గెట్ చేసిన కొడాలి నాని తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్ లు వినాయకచవితిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లోకేష్ లు శవం ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కరోనాతో ప్రజలకు ఇబ్బందులు వస్తే రాజకీయాలు చేయడం కోసం ఇప్పుడు ఈ డ్రామాలాడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తుంటే వినాయక చవితి విషయంలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.
బీజేపీ, టీడీపీల రచ్చ.. Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి ఉత్సవాల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటే, కావాలని మత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. గణేశ మండపాలు ఏర్పాటు చెయ్యొద్దని, వినాయక నవరాత్రులు ఇళ్లలో నిర్వహించుకోవాలని, ఇక పూజా సామాగ్రి కొనుగోలు వద్ద సామాజిక దూరం పాటించాలని, కరోనా ఆంక్షలు అమలు అవుతున్న నేపథ్యంలో బహిరంగ వేదికలపై ఉత్సవాలు నిర్వహించడం కూడదని ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఇక ఈ నేపథ్యంలో మద్యం షాపులకు లేని కరోనా, స్కూళ్ళు తెరవడానికి లేని కరోనా, పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, వర్ధంతులు, వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడానికి లేని కరోనా వినాయక చవితి నిర్వహించుకోవడానికి అడ్డం వస్తుందా అంటూ బీజేపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని అందుకే ఏ రాష్ట్రంలోనూ పెట్టని ఆంక్షలు, ఆంధ్రప్రదేశ్ లో పెడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ, టీడీపీ నాయకులు. నిన్నటికి నిన్న బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టి జగన్ సర్కార్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ వినాయక చవితి వేడుకలను నిర్వహించుకునేలా అనుమతించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.