KCR National Party : నరేంద్ర మోదీకి కేసీఆర్ సవాల్.. రైతు సెంటిమెంట్ తో రైతు పార్టీని స్థాపించబోతున్న కేసీఆర్
KCR National Party : కొన్ని వందల ఏళ్ల కింద.. భారత స్వాతంత్రం కోసం బ్రిటీష్ పాలనను తరిమికొట్టడం కోసం భారతీయులంతా ఉద్యమించారు. ఎందరో అమరులయ్యారు. చివరకు పరాయి పాలనకు స్వస్తి పలికారు. ఆంగ్లేయులను తరిమికొట్టారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు. అదే స్ఫూర్తితో వచ్చిందే తెలంగాణ ఉద్యమం. ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణ వివక్షకు గురవుతోందని.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. కానీ.. 1969 తొలి దశ ఉద్యమం నీరుగారిపోయింది. ఆ తర్వాత చాలామంది ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినా అది సాధ్యం కాలేదు. చివరకు 2001 లో కేసీఆర్.. టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రత్యేక తెలంగాణే ఊపిరిగా ఉద్యమించారు. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
తెలంగాణను సాధించి చరిత్రలో నిలిచిపోయారు కేసీఆర్. కానీ.. అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో ఉద్యమించబోతున్నారు కేసీఆర్. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీపై ఎక్కుపెట్టారు. ఈ గుజరాతీల పాలన అంతం అవ్వాలని మంకుపట్టు పట్టారు. మరోసారి పోరాటానికి సిద్ధం అయ్యారు. ఏకంగా దేశాన్నే బాగు చేసేందుకు, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు జాతీయ పార్టీని స్థాపించబోతున్నారు సీఎం కేసీఆర్.
KCR National Party : రాజకీయమే శ్వాసగా బతుకుతున్న కేసీఆర్
రాజకీయాలు అంటే మామూలు విషయం కాదు. రాజకీయాల్లో రాణించాలంటే అంత ఈజీ కాదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులను చూసుకుంటే.. కొన్ని దశాబ్దాల నుంచి ఏలుతున్న వాళ్లను చేతి వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అవును.. చాలామంది మధ్యలో వెళ్లిపోయిన వాళ్లే. కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఆరితేరుతున్న వారిలో కేసీఆర్ ఉన్నారు.. ప్రధాని మోదీ కూడా ఉన్నారు. రాజకీయాల్లో ఎవరి అనుభవం వారిది.. ఎవరి పంథా వారిది. ఎవరి అడుగులు వారివి. కానీ… ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అనబోతున్నారు. దీంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. దేశంలో రైతులపై జరిగిన అఘాయిత్యాలనే ప్రధాన అంశంగా తీసుకొని చాలాసార్లు ప్రధాని మోదీపై విమర్శల అస్త్రాలను సంధించారు సీఎం కేసీఆర్. గుజరాతీల ప్రభుత్వం కాదు… తెలంగాణ వాళ్ల ప్రభుత్వం కాదు.. దేశంలో రైతు ప్రభుత్వాన్ని నెలకొల్పుదాం.. అందరూ కదిలి రండి అని దేశంలోని రైతులందరికీ పిలుపునిచ్చారు కేసీఆర్. దీంతో రైతులు, రైతు సంఘాలు కూడా కేసీఆర్ కు మద్దతు పలికేందుకు రెడీ అవుతున్నారు. రైతు నేతలే చట్టసభల్లో ఉండాలని చెబుతున్నారు. రైతు సెంటిమెంట్ తో, రైతు నేతలను ముందు పెట్టి.. రైతు పార్టీని కేసీఆర్ త్వరలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం.. మరి దేశంలోని రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో?