Neelakurinji flowers: ఇవి పన్నెండేండ్లకు ఒకసారి మాత్రమే పూసే పూలు.. అవి ఎక్కడో తెలుసా..?
Neelakurinji flowers: ప్రకృతి ఎంత అందమైనదో ఒక్కోసారి మాటల్లో వర్ణించలేం..! అందుకే ప్రకృతిని ఎంత ఆస్వాదించినా తనివి తీరదు..! ప్రకృతి అందాలను ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది..! రమణీయమైన ప్రకృతిని చూడగానే ఎంతటి చికాకులో ఉన్న మనిషికైనా మనసు పులకరిస్తుంది..! ఎత్తయిన కొండలు, భారీ లోయలు, పచ్చిక బయళ్లు, పరవశింపజేసే పైరగాలి, రకరకాల చెట్లు, మొక్కలు, అందమైన పూలు.. ఇలా ప్రకృతి రమణీయతను ఊహించుకుంటేనే మనసు పులకరించిపోతుంది.
అలాంటి ప్రకృతి కొన్ని అరుదైన సందర్భాల్లో మరింత అందంగా కనిపిస్తూ మనసుకు గిలిగింతలు పెడుతుంది. అలాంటి అరుదైన ప్రకృతి సౌందర్యమే ఇప్పుడు కేరళ రాష్ట్రం, ఇడుక్కి జిల్లాలోని శాంతన్‌పారా షాలోమ్ హిల్స్‌లో ఆవిష్కృతమైంది. ఆ కొండల్లో పూసిన అత్యంత అరుదైన నీలకురింజి పూలను చూడటానికి రెండు కండ్లు చాలవు. నేలపై నీలి దుప్పటి కప్పినట్టుగా కడు రమణీయంగా ఆ పుష్ప సోయగం ఉన్నది.
ఈ నీలకురింజి పుష్పాలు ఎప్పుడుపడితే అప్పుడు వికసించవు. సాధారణంగా 12 ఏండ్లకు ఓసారి మాత్రమే వికసించే ఈ నీలకురింజి పువ్వులు.. ప్రస్తుతం శాంతన్‌పారా షాలోమ్ హిల్స్‌ను సందర్శిస్తున్న పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. ఈ పూల శాస్త్రీయ నామం స్ట్రోబిలాంథస్ కుంతియానస్. ఇవి సాధారణంగా జూలై-అక్టోబర్ మధ్యలో పూస్తాయి. నీలకురింజి అంటే మలయాళంలో నీలిరంగు పువ్వు అని అర్థం.
Neelakurinji flowers: జీవితకాలంలో ఒక్కసారే పూత..
ఈ నీలకురింజి పువ్వుల పరాగసంపర్కానికి చాలాకాలం అవసరం. అందుకే ఇవి వికసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు ఈ నీలకురింజి మొక్కలు జీవితకాలంలో ఒక్కసారే పూస్తాయి. మొక్కలు మొలకెత్తిన తర్వాత 12 ఏండ్లకు పూతపూసి, ఆ తర్వాత ఎండిపోతుంది. ఆ మొక్క నుంచి రాలిన విత్తనాల నుంచి మళ్లీ మొక్కలు మొలిచి 12 ఏండ్లకు పూతపూస్తాయి. ఈ నీలకురింజి పువ్వులు వికసించే సీజన్‌లో సేకరించే తేనె రుచిగా ఉంటుందట.
పోషకాల పరంగానూ ఈ సీజన్‌లో వచ్చే తేనె చాలా శ్రేష్ఠమైనదట. అందుకే ఈ సీజన్‌లో తేనె ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నీలకురింజి మొక్కలు ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెరుగుతాయట. వీటిలో మొత్తం 250కి పైగా జాతులు ఉన్నాయట. ఆ 250కి పైగా జాతులలో 46 జాతులు భారతదేశంలోనే కనిపిస్తాయట. ఇవి ప్రధానంగా పశ్చిమ కనుమలలో ఉంటాయట. ఈ పూల సోయగానికి సంబంధించిన వీడియోను ఓ జాతీయ మీడియా సంస్థ ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా అయ్యింది.