Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎందుకంత కన్‌ఫ్యూజన్.!
Rajagopal Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. భారతీయ జనతా పార్టీలోనూ అయోమయం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికీ ఈ వ్యవహారం మింగుడు పడటంలేదు. ఒక్క కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.. మూడు పార్టీల్ని అయోమయంలో పడేసి, తాను మరింత అయోమయానికి గురవుతున్నారు. కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలోనే వున్నారు. ఔను, వున్నారంటే వున్నారంతే. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో వుండటానికి ఇష్టపడటం లేదు. అలాగని, ఇంతవరకు వేరే ఏ పార్టీలోనూ చేరలేదు. చేరతారో లేదో తెలియదు. భారతీయ జనతా పార్టీ ఆయన మీద చాలా ఆశలు పెట్టుకుంది.
కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి గనుక భారతీయ జనతా పార్టీలో చేరితో తమ పార్టీ మరింత బలం పుంజుకుంటుందని సాక్షాత్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. ఇదే భావ దారిద్ర్యం అంటే. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతానికి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కంటే పవర్ వున్న నాయకులున్నారు. అలాంటప్పుడు, కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి రాకతో బీజేపీకి కొత్తగా వచ్చే లాభమేముంటుంది.? పైగా ఆయన ఏ పార్టీలో వున్నా ఆ పార్టీకి తలనొప్పే. రాజకీయంగా ఓ మాట మీద నిలబడలేరు ఆయన.. అన్న విమర్శ వుండనే వుంది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కొందరు దఫ దఫాలుగా కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డితో మాట్లాడుతున్నారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయనలో అసంతృప్తి తగ్గిపోతుందనే ఆశతో వున్నారు. మరోపక్క, రాజీనామా చేయాలంటూ రాజ గోపాల్ రెడ్డి మీద ఒత్తిడి పెరుగుతుంది. రాజీనామా చేస్తే తనకు అస్సలేమాత్రం విలువ వుండదని ఆయన భావిస్తున్నారు. ఇది కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నడుమ పంచాయితీ మాత్రమే కాదు, జరుగుతున్న రాజకీయ రచ్చని తెలంగాణ రాష్ట్ర సమితి కూడా నిశితంగా పరిశీలిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ (కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి) విడిపోతే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అది తెలంగాణ రాష్ట్ర సమితికి మరింత అడ్వాంటేజ్ అవుతుంది. ఈ రాజకీయ రగడ ఎప్పుడు చల్లారుతుందోగానీ, అందర్నీ గందరగోళంలోకి నెట్టేసి.. ఏం చేయాలో పాలుపోక రాజ గోపాల్ రెడ్డి కూడా విలవిల్లాడుతుండడం ఆశ్చర్యకరమే.