Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చెప్పిన సర్వే నిజమా అబద్ధమా.. చంద్రబాబుకి హింట్ ఇస్తున్నాడా?
Pawan Kalyan : 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కటంటే ఒక్కటే సీటు. అది కూడా రాజోలు సీటు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసినా గెలవలేదు. గాజువాక, భీమవరం రెండు స్థానల్లో పవన్ పోటీ చేశారు కానీ.. ఎందుకో పవన్ ను గెలిపించుకోలేకపోయారు అక్కడి ప్రజలు. కట్ చేస్తే.. 2024 ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. కానీ.. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనసేన ఇప్పుడు లేదు. జనసేనకు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే.. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి మాత్రం 45 నుంచి 67 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది అని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు బాగానే కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ది చిలక జోస్యం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ గురించి కాదు.. ముందు జనసేన పార్టీ లెక్కలు, టీడీపీ లెక్కలు చెప్పండి అంటూ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. నిజానికి.. వైసీపీ గెలిచే సీట్లు ఇవి అని ఒక అంచనా వేశారు పవన్. కానీ.. వైసీపీ నేతలు దానిపై పెద్ద రాద్ధాంతమే చేస్తున్నారు. అయితే… జనసేనకు 2019 లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని పవన్ స్పష్టం చేశారు. జనసేనకు ఆదరణ పెరిగిందని తెలిపారు.
Pawan Kalyan : 2014 పొత్తులు రిపీట్ కాబోతున్నాయా?
పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్కలపై కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు వైసీపీ నేతలు. 2014 ఎన్నికల్లో వైసీపీకి 67 స్థానాలే వచ్చాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చారు. కేవలం ఆయన మద్దతు మాత్రమే ఇచ్చారు. అప్పుడే ఆయన పార్టీ పెట్టారు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడు టీడీపీ 102 స్థానాల్లో గెలిచింది. వైసీపీ 67 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు మళ్లీ 2024 లో పదేళ్ల తర్వాత వైసీపీకి అదే 67 స్థానాలు వస్తాయని చెబుతున్నారంటే.. మళ్లీ అప్పటి పొత్తులు రిపీట్ కాబోతున్నాయా అని వైసీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. పరోక్షంగా పవన్ కళ్యాణ్.. అప్పటి పొత్తులను రిపీట్ చేస్తున్నామని చెప్పకనే చెబుతున్నారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.