Pawan Kalyan : జగన్ సర్కారుని జనసేనాని పవన్ కల్యాణ్ ఎందుకు టార్గెట్ చేసినట్టు.?
Pawan Kalyan : విపక్షం అన్నాక, అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిందే. ప్రశ్నించకపోతే అది విపక్షం అవదు. కానీ, అలా ప్రశ్నించడంలో హేతుబద్ధత అనేది వుండాలి. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే పవన్ కళ్యాణ్, నిజానికి ప్రశ్నించడం ఏనాడో మర్చిపోయారు. లేకపోతే, 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్, ప్రత్యేక హోదాపై ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు.? అప్పట్లో టీడీపీతోనూ కలిసి వున్న జనసేనాని, అప్పట్లో టీడీపీని ఎందుకు నిలదీయలేకపోయారు.? నిజానికి ప్రశ్నించారు, నిలదీశారు.. అయితే, అందులో చిత్తశుద్ధి లేదు. అదే అసలు సమస్య. ‘పాచిపోయిన లడ్డూలు..’ అంటూ కేంద్రంపై రంకెలేశారు జనసేనాని అప్పట్లో.
కానీ, ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్, అదే బీజేపీతో కలిసిపోయారు. టీడీపీ మీద చంద్రబాబు చేసిన విమర్శలూ అలాంటివే. కానీ, వైసీపీ మీద విమర్శల విషయానికొస్తే, జనసేన కొత్త పంథా అవలంబిస్తున్నారు. కానీ, జనసేనాని విశ్వసనీయత కోల్పోతున్నారు. జనసేన పార్టీకి జనసైనికులే బలం. ఆ జనసైనికులెవరో కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు. వాళ్ళే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి సరిగ్గా ఓట్లేయలేదన్న విమర్శ వుంది. ఎందుకు.? అంటే, జనసేనాని ఎప్పుడు ఎవరి జెండా పట్టుకోమంటారో తెలియక, అయోమయానికి గురవుతుంటారు జనసైనికులు.

Why Pawan Kalyan Targets Ys Jagan
ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నేడు వాహన మిత్ర నిధుల్ని విడుదల చేయగా, అదే రోజు.. ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అంటూ సోషల్ మీడియా క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. వర్షాకాలంలో రోడ్లు నాశనమైపోతాయ్. దాన్ని పట్టుకుని పబ్లిసిటీ స్టంట్లు చేయడం వల్ల జనసేనకు ఒరిగేదేంటి.? లబ్దిదారులు ప్రభుత్వానికి జై కొట్టాక, ముఖ్యమంత్రికి అండగా వున్నామని నినదించాక.. జనసేన క్యాంపెయిన్‌లో అర్థమేముంది.? ఇదొక అల్లరి కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయింది. రోడ్ల విషయమై ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పు కాదు. కానీ, దానికీ ఓ సమయం సందర్భం వుండాలి కదా.? అది తెలిస్తే జనసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇలా ఎందుకు వుంటుంది.?