Revanth Reddy : ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు అతిగా స్పందిస్తున్నారు?
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బిజీగా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. పార్టీని పునరుత్తేజం చేయాలని రేవంత్ రెడ్డి కసి మీద ఉన్నారు. అందుకే.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని.. అధికార పార్టీపై, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీలో బలమైన వాయిస్ వినిపించేది రేవంత్ రెడ్డి మాత్రమే. ఆయన లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే లేదు. ఆయనే ప్రస్తుతం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా గెలిచి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy : వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి
అంతవరకు బాగానే ఉంది కానీ.. ఎందుకో రేవంత్ రెడ్డి.. వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తున్నారేమో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ప్రసంగించిన ప్రతిసారీ షర్మిలను లాగుతున్నారని.. అసలు షర్మిల గురించి రేవంత్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
నిజానికి తెలంగాణలో వైఎస్ షర్మిల ఇంకా పార్టీనే పెట్టలేదు. పెట్టినా ఆమె పార్టీకి అంత ప్రాధాన్యత ఉండదని.. రేవంత్ రెడ్డి అనవసరంగా వైఎస్ షర్మిల గురించి మాట్లాడి ఆమెకే ప్రాధాన్యత కల్పిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా షర్మిల పార్టీ గురించి పెద్దగా స్పందించలేదు. కానీ.. ఎక్కువ సార్లు స్పందించింది రేవంత్ రెడ్డి మాత్రమే.
ఒక రకంగా చెప్పాలంటే.. షర్మిల పార్టీ పెట్టకముందే.. రేవంత్ రెడ్డి వర్సెస్ షర్మిల వర్గం అన్నట్టుగా తయారైంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున రేవంత్ రెడ్డి ఎందుకు లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం.. షర్మిల గురించి ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.