Politics : రాజకీయాల్లో మహిళా నేతలకు ఎందుకు ఈ దుస్థితి.?
Politics : సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా మహిళలంటేనే గ్లామర్.! అలా తయారైంది వ్యవస్థ. సినిమా హీరోయిన్లు రాజకీయ పార్టీలకు అదనపు గ్లామర్ అద్దుతారు. సినిమా హీరోలు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. అయితే, సినిమా హీరోల కంటే, సినిమా హీరోయిన్లకు రాజకీయాల్లో అవమానాలు ఎక్కువ. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి ఎదురయ్యే తలనొప్పులతోపాటు, సొంత పార్టీలో ఎదురయ్యే సమస్యలు మహిళా నేతల్ని మానసికంగా కుంగదీస్తాయి. దేశ రాజకీయాల్లో మహిళా శక్తి తక్కువేమీ కాదు. ఐరన్ లేడీ ఇందిరాగాంధీ.. ఇప్పుడున్న రాజకీయాల్లో ఐరన్ విమెన్ మమతా బెనర్జీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే.
కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లుకలుకలున్నా, ఆ పార్టీని నడిపిస్తోన్న శక్తి సోనియాగాంధీ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉక్కు మహిళగానే పేరు తెచ్చుకున్నారు. అవమానాలను ఎదుర్కొని రాజకీయంగా ఎదిగినవారిలో జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మన తెలుగు రాజకీయాల్లో రోజా గురించి కూడా అలాగే చెప్పుకోవాలేమో. టీడీపీకి ఆమె ఎంత సేవ చేశారో, అంతకు మించి ఆమె ఆ పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నారు. వైసీపీలో చేరాకనే, చట్ట సభలకు వెళ్ళాలన్న ఆమె కల నిజమయ్యింది. ఆమె మంత్రి కూడా అయ్యారు. అయితే, వైసీపీలో కూడా ఆమె చాలా అవమానాలే ఎదుర్కొన్నారు. సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొందరు రోజాని నానా రకాల అవమానాలకూ గురిచేశారు.
అన్నట్టు, జయప్రద కూడా తెలుగుదేశం పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నవారే. దాంతో తెలుగు రాజకీయాలు వదిలేసి, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేఇంచి, అక్కడి నుంచి చట్ట సభలకు ఎదిగారామె. తాజాగా మరో సినీ నటి దివ్య వాణి టీడీపీ బాధితురాలిగా మిగిలిపోయారు. రాజకీయాల్లో మహిళలకే ఎందుకు ఇన్ని అవమానాలు.? అంటే, అవమానాలు ఎవరికైనా ఎదురవ్వొచ్చు. మహిళలకు ఎదురయ్యే అవమానాలు ఇంకాస్త ప్రత్యేకం. ప్రత్యర్థి పార్టీలనైతే సమర్థవంతంగా ఎదుర్కోగలరుగానీ, సొంత పార్టీలోనే తమను తొక్కేయాలని చూస్తే.. వాటిని తట్టుకోగలిగేంత కఠినాత్మకంగా మహిళా నేతలు వుండలేకపోవడమే వారికి అతి పెద్ద సమస్య అనుకోవాలేమో.!