KCR : మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో అలజడి.. కేసీఆర్ కు వైఎస్ జగన్ మద్దతు.. అలా చేస్తే ఏపీ ప్రజలు క్షమిస్తారా?
KCR : మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో అలజడి మొదలైంది. మరోసారి రెండు రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి ఏపీగా ఉన్న రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి కూడా తొమ్మిదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ మాత్రం ఆకాశమే హద్దు అన్నట్టుగా అభివృద్ధిలో ముందంజలో ఉంది. కానీ.. ఏపీలో మాత్రం సరైన రాజధానే లేదు. టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని అంటే… వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు అంటే.. ప్రత్యేక ఏపీ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు కావస్తున్నా ఒక రాజధాని లేదు.. ఏదీ లేదు.
ఓవైపు తెలంగాణ అభివృద్ధిలో టాప్ లో ఉంటే.. ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదనేది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. అయితే.. ఉమ్మడి ఏపీని విడదీసి.. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ ను డెవలప్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆంధ్రులను మోసం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పనిపై ఆంధ్రా ప్రజల్లో చాలా కోపం ఉంది. రెండు రాష్ట్రాలను విడదీసిన పాపం ఆయనదే అంటున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. జాతీయ రాజకీయాలు అంటేనే డైరెక్ట్ గా ప్రధాని మోదీని ఢీకొట్టడం.
KCR : తెలంగాణ మంత్రి బహిరంగంగానే ఎందుకు చెప్పినట్టు?
ప్రధాని మోదీకి ఇక్కడ ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరోక్షంగా అన్ని విషయాల్లో సహకరిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మద్దతు ఇస్తారా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. మెజారిటీ ఏపీ ప్రజలు మాత్రం ఇవ్వకూడదు అనే కోరుకుంటున్నారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మాత్రం ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మద్దతు.. కేసీఆర్ కు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. నిజానికి.. కేసీఆర్ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేసి కేంద్రంలో ఆ ఫ్రంట్ ను అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీని కాదని సీఎం జగన్.. కేసీఆర్ కు మద్దతు ఇస్తారా? అనేదే తెలియాల్సి ఉంది. ఒకవేళ మద్దతు ఇస్తే ఏపీ ప్రజలు ఊరుకుంటారా? వాళ్లు క్షమిస్తారా? ఒకవేళ సీఎం జగన్.. కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలనుకుంటే ఏపీ ప్రజల నుంచి వ్యతిరేకత మాత్రం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.