Narendra Modi : ముందస్తు ఎన్నికలపై నరేంద్ర మోడీ వ్యూహమేంటి.?
Narendra Modi : దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ముందస్తు ఎన్నికలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘బస్తీ మే సవాల్.. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వండి..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకే సవాల్ విసిరేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఎలాగూ, ‘దిగిపోండి..’ అంటూ కేసీయార్ మీద ముందస్తు సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికలంటూ గతంలో హంగామా చేసిన కేంద్రం, ఆ తర్వాత సైలెంటయిపోయింది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ తలచుకుంటే, పెద్ద నోట్ల రద్దు తరహాలో రాత్రికి రాత్రి జమిలి ఎన్నికలకు సిద్దమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
అయితే, రాజకీయంగా తమకు పనికొచ్చే పని అయితేనే, దేన్నయినా చేయగలుగుతారు ప్రధాని నరేంద్ర మోడీ. డబుల్ ఇంజిన్.. అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ వచ్చిన సమయంలో వ్యాఖ్యానించిన ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర సమితి మీదగానీ.. కేసీయార్ మీదగానీ నేరుగా విమర్శలు చేయలేకపోయారు. ‘నువ్వు తిట్టినట్లు నటించు.. నేను ఏడ్చినట్లు నటిస్తా..’ అన్నట్లు రాజకీయాలు నడుస్తంటాయి. కేసీయార్, మోడీ మధ్య వ్యవహారం కూడా ఇంతే అనుకోవాలా.? అంటే, దానిపై మళ్ళీ భిన్న వాదనలు వున్నాయి.

Will Narendra Modi Vote For Early Elections
జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పటి సానుకూలత మోడీ సర్కారుపై ఇప్పుడు లేదన్నది నిర్వివాదాంశం. దాంతో, నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పడుతున్న పాట్లు చూస్తున్నాం. ఇదే ఓ పెద్ద సంకేతం, ముందస్తుపై మోడీ అస్సలేమాత్రం అత్యుత్సాహం చూపరని చెప్పడానికి. అయితే, రాజకీయాల్లో ఈక్వేషన్స్ రాత్రికి రాత్రి మారిపోతుంటాయ్. అనూహ్యమైన పరిణామాలకు రాజకీయాల్లో చోటెక్కువ.