Ajit Pawar : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
ప్రధానాంశాలు:
Ajit Pawar : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్ (66)తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఇదుగురూ మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ధ్రువీకరించింది. విమానంలో ఎవరూ బతికి లేరని వెల్లడించింది. అజిత్ పవార్‌తో పాటు ముంబయి పీఎస్‌వో వదీప్ జాదవ్, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి మరణించినట్లు తెలిపింది.
Ajit Pawar : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయి నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైనట్లు తెలుస్తోంది. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మూడు మృతదేహాలను బారామతి మెడికల్ కాలేజీకి తరలించామని మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పుణె ఎస్పీ తెలిపారు. డీజీసీఏ అధికారుల బృందం కూడా ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.
ఇక ప్రమాద వార్త తెలియగానే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలను తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, అజిత్ పవార్ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావ్ పవార్.. సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌పవార్.. 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అజిత్ పవార్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య సునేత్ర పవార్ రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.