కరోనా టైమ్ లో ఏ రాజకీయ నేత చేయని పని చేస్తున్న ఎమ్మెల్యే?
ప్రస్తుతం కరోనా టైమ్ నడుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కరోనా పేరు చెబితేనే ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు. రోజూ తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వందల మంది కరోనాతో ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో చాలామంది కరోనా మృతుల అంత్యక్రియలు పెద్ద సమస్యను సృష్టిస్తున్నాయి. కరోనాతో మరణించిన వాళ్ల అంత్యక్రియలు చేయడానికి వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. ఆసుపత్రుల్లోనే కరోనా మృతుల బాడీలు ఉండిపోతున్నాయి. అలా… ఆసుపత్రుల్లో, శవాగారాల్లో కుప్పలు కుప్పలుగా ఉండిపోతున్న అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడానికి ముందుకు వచ్చారు తిరుపతికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పూనుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలతో బయటపడితే చాలు.. అని అందరూ అనుకుంటున్న సమయంలో.. ప్రాణాలకు తెగించి.. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కూడా భూమన.. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. అప్పుడు వందల సంఖ్యలో కరోనా మృతులకు ఆయన దహన సంస్కారాలు నిర్వహించి.. శెభాష్ అనిపించుకున్నారు. ఆయన సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే.. కరోనా సమయంలో తనకు చేతనైన సాయం చేస్తున్నారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కూడా విజృంబిస్తున్న నేపథ్యంలో మరోసారి ఆయన నడుం బిగించి.. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
ఒక్కరోజే 21 మంది కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు
తిరుపతిలో నిన్న బుధవారం ఒక్క రోజే రుయా మార్చురీలో ఉన్న 21 మంది కరోనా మృతదేహాలకు ఎమ్మెల్యే భూమన సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే… కరోనా వల్ల వాళ్లు మరణించడంతో.. వాళ్లకు అంత్యక్రియలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆసుపత్రుల్లోనే ఆ మృతదేహాలు మగ్గిపోతున్నాయి. దాని వల్ల లేనిపోని సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే… నేనే ముందుకు వచ్చి వాళ్లకు అంత్యక్రియలు నిర్వహించా. గత సంవత్సరం కూడా మేమంతా కలిసి సుమారు 500 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాం.. అని ఆయన వెల్లడించారు.