జగన్ మరోసారి తన మార్క్ చూపించి చైర్మన్ ఎంపిక
ఏపీలో మండలిని రద్దు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైకాపా నాయకులు ఇప్పుడు మండలి కొనసాగాలనే స్థాయికి వచ్చారు. ఎందుకంటే వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో మండలిలో ఆ పార్టీ బలం సింగిల్ డిజిట్ మాత్రమే. దాంతో ప్రతి బిల్లు కూడా మండలిలో వెనక్కు వస్తూ ఉండటంతో జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో ఒకానొక సమయంలో మండలిని రద్దు చేసేందుకు అసెంబ్లీలో బిల్లును కూడా తీసుకు వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మండలిని కొనసాగించేందుకు ఆసక్తిగా ఉంది. మండలి ని రద్దు చేయాలనే ఆలోచన చేయడం లేదు. మండలిలో బలా బలాలు తారు మారు అయ్యాయి. దాంతో జగన్ ఇప్పుడు చైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలనే విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
జూన్ లో మండలిపై వైకాపా జెండా..
ఎమ్మెల్యే.. స్థానిక సంస్థల కోటాలో భారీగా వైకాపా ఎమ్మెల్సీలు సభలో అడుగు పెట్టే అవకాశం ఉంది. మండలిలో జూన్ నాటికి 30 మందికి పైగా వైకాపా ఎమ్మెల్సీలు ఉండబోతున్నారు. మొత్తం 58 ఎమ్మెల్సీలో మెజార్టీ వైకాపా ఉండబోతున్నారు. ఈ ఏడాది చివరి వరకు తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీల సంఖ్య చాలా వరకు తగ్గబోతుంది. ఇక ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పదవి కాలం మే 24 తో ముగియబోతుంది. దాంతో ఆ స్థానంలో కొత్త ఎమ్మెల్సీ గా వైకాపా సభ్యుడు ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీసీలకే పట్టం..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈమద్య కాలంలో ఎక్కువగా బీసీలకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు. కనుక ఈ చైర్మన్ పీఠంపై కూడా బీసీ లేదా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్సీని కూర్చోబెట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సభలో ఉన్న వారు కాకుండా పలువురు కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎంపిక కాబోతున్నారు. వారిలో చాలా మందికి కూడా అవకాశం ఉంది. కనుక ఇప్పటి నుండే ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం చాలా మంది కాచుకు కూర్చున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చలు జరిపి చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.