YS Jagan : చంద్రబాబు ఇలాకాలో వైఎస్ జగన్ జెండా ఎగరడం సాధ్యమా?
YS Jagan : ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు సంవత్సరాలు ఉండగానే పార్టీ నాయకులను, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 కొత్త జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్ లు, మంత్రులు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మనం యుద్ధం చేస్తున్నది కేవలం చంద్రబాబు నాయుడితో మాత్రమే కాదు. ఆయనకు వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియా తో కూడా.. ఎల్లో మీడియా తీరును క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి.
ఎల్లో మీడియా అవాస్తవాలను ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తుందో అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా తెలియజేయాలి. కలిసికట్టుగా పని చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాలి. మనమంతా ఒకటే కుటుంబం అన్నట్లుగా ఉండాలి. జిల్లా అధ్యక్షులకు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ గా క్యాబినెట్ హోదా ఇవ్వబోతున్నాం. అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే రాబోతున్నాయి. మే నెల నుండి పూర్తి స్పీడ్ గా పార్టీ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకు వెళ్లాలి అంటూ జగన్ దిశా నిర్దేశం చేశారు. గత ఎన్నికల సమయం లో 151 సీట్లు గెలిచాం. ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలకు ఎంతో సేవ చేశాం ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కనుక ఈసారి 151 సీట్ల కంటే ఎక్కువగానే గెలుపొందబోతున్నాం.కుప్పంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచాం… మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా గెలిచాం.
కనుక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ గెలుస్తాం. చంద్రబాబు నాయుడు నియోజక వర్గం అయిన కుప్పం ని సొంతం చేసుకోవడం ద్వారా ప్రజల్లోకి మరింతగా మన పథకాలను తీసుకు వెళ్లినట్లు అవుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తూ వస్తున్నారు. అక్కడ ఆయన కంచుకోట ఏర్పాటు చేశాడు. అక్కడ గట్టిగా ప్రయత్నిస్తే వైకాపా విజయం సాధించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పై అంత సులువుగా విజయం సాధ్యం కాదు కానీ జగన్ దృష్టి పెట్టి నాయకులు కష్టపడితే అక్కడ విజయం సాధ్యం అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అన్నట్లుగా వైకాపా నాయకులు ప్రయత్నిస్తే కనీసం చంద్రబాబు నాయుడు కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.