YS Sharmila : ఆదిలోనే హంసపాదు.. పార్టీ పెట్టకముందే ప్లాన్ మార్చుకున్న షర్మిల?
YS Sharmila : వైఎస్ షర్మిల.. ప్రస్తుతం ఏనోటా విన్న ఇదే పేరు పలకరిస్తున్నారు. తెలంగాణ, ఏపీ అనే తేడా లేకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ షర్మిల టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమంటూ స్పీచ్ కూడా ఇచ్చారు. త్వరలోనే పార్టీకి సంబంధించిన విధివిధానాలు, పేరును ప్రకటించనున్నట్టు ఆమె తెలిపారు.
అయితే.. పార్టీ పెట్టకముందే.. పలు జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల భేటీ అవుతున్నారు. తెలంగాణలో పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ప్రజా సమస్యలపై ఎలా ముందుకెళ్లాలి? అనే అంశాలపై వైఎస్సార్ అభిమానులతో ఆమె చర్చిస్తున్నారు.
అందుకే తొలి జిల్లా పర్యటనగా షర్మిల ఖమ్మం జిల్లాను ఎంచుకున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 21న ఖమ్మం జిల్లాకు వెళ్లి అక్కడ వైఎస్ అభిమానులు, నేతలతో సమావేశం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఆదిలోనే హంసపాదులా.. ఆ పర్యటన రద్దు అయింది.
YS Sharmila : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. పర్యటన వాయిదా
తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొన్నది. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఈసీ విడుదల చేసింది. ఈ సమయంలో పార్టీ పర్యటనలు చేయడం కన్నా.. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక పర్యటన చేస్తే బెటర్ అని షర్మిల భావించారట. అందుకే.. ఖమ్మం జిల్లా పర్యటనను షర్మిల వాయిదా వేసుకున్నారు.
నిజానికి.. ఈనెల 21న ఉదయం హైదరాబాద్ లోని షర్మిల నివాసం లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ తో షర్మిల ర్యాలీగా ఖమ్మం వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేశారు. దారి పొడుగునా.. స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అన్నింటినీ క్యాన్సల్ చేసేశారు.