YS Sharmila : రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు తర్వాత షర్మిల కేసీఆర్ పై సీరియస్ కామెంట్స్..!!
YS Sharmila : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనపై జరిగిన దాడికి సంబంధించి రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ్ సై కి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ డైరెక్షన్లోనే తనపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని ఆరోపించారు. గత కొద్ది నెలల నుండి తాను చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రని అడ్డుకోవడానికి కేసీఆర్ కుట్ర పన్నారు. కుట్రలో భాగంగా ఫ్లెక్సీలు.. బస్సులు తగలబెట్టడంతో పాటు కార్యకర్తలను రెచ్చగొట్టారని వాహనాలు ధ్వంసం చేశారని మీడియా ముందు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తమపై దాడి చేసిన టిఆర్ఎస్ గుండాలను వదిలిపెట్టి పోలీసులు తమన్న అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.
పాదయాత్రలో వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ సర్వేలో YSRTP పార్టీకి ఆదరణ పెరిగిందని.. తేలడంతోపాటు కేసీఆర్ పతనం మొదలైంది కాబట్టే.. ఇటువంటి దాడులు తనపై జరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య పోలీసులు మరియు టిఆర్ఎస్ గుండాలే సృష్టిస్తున్నారని విమర్శించారు. తనపై జరిగిన దాడుల గాయాలు కేసిఆర్ కి చూపిద్దామని ప్రగతి భవన్ కి వెళ్లాలనుకున్న సమయంలోనే పోలీసులు ముందుగానే ఓవరాక్షన్ చేసి అడ్డుకున్నారు. కావాలని ట్రాఫిక్ సమస్య సృష్టించారు. ఒక మహిళ అని చూడకుండా క్రేన్ సాయంతో మమ్మల్ని తీసుకెళ్లారు. మా మనుషులను అరెస్టు చేసి తీవ్రంగా కొట్టారు. పోలీసులకు కొట్టే అధికారం ఎక్కడిది అని వైయస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన జరగటం లేదని దొరల… పాలన జరుగుతుంది అని అన్నారు.
కెసిఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ క్రమంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ నీ పాదయాత్రలో నిలదీస్తూ ఉంటే అధికార పార్టీ ఓర్చుకోలేకపోతుందని అన్నారు. ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని విమర్శించారు. కెసిఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్ లో దోచుకుంది. కొడుకు కేటీఆర్ బినామీల పేరుతో లక్షల కోట్లు సంపాదించారు. రైడ్ లు చేస్తే కేసీఆర్ కుటుంబం ఇంకా ప్రగతి భవన్ మీద చేయాలి… అప్పుడు లక్షల కోట్లు బయటపడతాయి అని అన్నారు. ఇంక మంత్రి సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి షర్మిల మండిపడ్డారు. అటువంటి వ్యాఖ్యలను మీ తల్లినో… చెల్లినో అంటే మీరు ఊరుకుంటారా..? అని షర్మిల మండిపడ్డారు. కేటీఆర్ భార్య ఆంధ్ర నుంచి రాలేదా..?
మరి అలాంటప్పుడు నన్ను ఆంధ్ర పెత్తనం అని ఎలా అంటారు. నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను. అబిడ్స్ స్కూళ్లకు వెళ్లాను. మెహదీపట్నంలో కాలేజీ చదువు చదివాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. ఇక్కడే నా బిడ్డలను కన్నాను. ఇక్కడి ప్రజలకు సేవ చేయడం నా హక్కు మాత్రమే కాదు బాధ్యత ముమ్మాటికి నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ ఆడపడుచునే అని వైయస్ షర్మిల తెలియజేశారు. అంతేకాదు రేపటినుండి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు తెలిపారు. తమపై దాడులు చేస్తారని.. టిఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు ఈ విషయంలో పోలీసులు రక్షణ కల్పించాలి. మా మనుషులకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత కేసీఆర్ దేనని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిందని కేసీఆర్ తాలిబాన్ అధ్యక్షుడిగా మారారని తనదైన శైలిలో షర్మిల వ్యాఖ్యానించారు.