YS Sharmila : మునుగోడు ఉపఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీ? అభ్యర్థి ఎవరు? షర్మిల పార్టీని మునుగోడు ప్రజలు ఆదరిస్తారా?
YS Sharmila : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఉపఎన్నిక గురించే తెగ చర్చ నడుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రధాన పార్టీలన్నీ ఒక్కసారిగా మునుగోడు వైపు చూశాయి. కోమటిరెడ్డి రాజీనామా వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేకూరనుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అతీగతీ లేదు. ఉన్న కొద్ది మంది నాయకులతో పార్టీని నెట్టుకొస్తున్నారు. ఉన్న సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు పార్టీలు మారుతుండటంతో కాంగ్రెస్ పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు ఎలాగైనా మునుగోడు ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. బీజేపీ కూడా అంతే. ఈ పార్టీల నడుమ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముందుకొచ్చింది వైఎస్సార్టీపీ పార్టీ. వైఎస్ షర్మిల ఇప్పటి వరకు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. కానీ.. ఈసారి మునుగోడు ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని వైఎస్ షర్మిల ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
YS Sharmila : నల్గొండతో వైఎస్సార్ కు అనుబంధం
వైఎస్ షర్మిల పార్టీ పెట్టడమే కాదు.. దాదాపు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసింది. దాదాపు అన్ని ప్రాంతాలు తిరిగింది. ఏడాది నుంచి సీఎం కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తూ షర్మిల ముందుకు సాగింది. ఇక ఎన్నికల్లో పోటీ చేయాల్సిన సమయం వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు నల్గొండ జిల్లాలో వైఎస్సార్ కు ఉన్న ఆదరణ, అనుబంధం వేరు. వైఎస్సార్ కు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం షర్మిల పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలు కూడా నల్గొండ జిల్లాకు చెందిన వాళ్లే. వైఎస్సార్ కు ఉన్న అభిమానులు.. వైఎస్ షర్మిలపై అభిమానం చూపిస్తారా? అనేదే పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా.. తన తండ్రి ఆదరణకు తనవైపునకు మార్చుకోవడం కోసం తనకు మునుగోడు ఉపఎన్నికే సరైందని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలోని మిగితా పార్టీలేవి షర్మిలను అంతగా సీరియస్ గా తీసుకోకున్నా.. మునుగోడు ఉపఎన్నికలో చరిత్ర సృష్టించాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడులో తనే బరిలోకి దిగుతుందా? లేక వేరే అభ్యర్థిని బరిలోకి దింపుతుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నప్పటికీ.. వైఎస్ షర్మిల పార్టీ నుంచి మునుగోడులో బరిలోకి దిగితే మాత్రం.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాని వల్ల టీఆర్ఎస్ అభ్యర్థికి లాభం చేకూరుతుందని అంటున్నారు. ఏది ఏమైనా.. వైఎస్ షర్మిలకు మునుగోడు ఉపఎన్నిక పెద్ద పరీక్షే. దాన్ని ఆమె ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాల్సిందే.