YS Jagan : ఆ ఎమ్మెల్యే ఇన్.. ఈ ముగ్గురు మంత్రుల్లో ఒకరు ఔట్?
YS Jagan cabinet : ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు గత కొన్ని రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే.. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుంది. ఏ మంత్రి నైనా మంత్రి వర్గం నుంచి తొలగిస్తారా? కొత్త వాళ్లకు చాన్స్ ఇస్తారా? ఇస్తే ఏ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కునుంది.. అనే సమీకరణలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. మొదటి సారి సీఎం జగన్ కేబినేట్ లో చోటు దక్కని చాలామంది ఎమ్మెల్యేలు ఈసారి అయినా చోటు దక్కించుకోవాలని తెగ వ్యూహాలు పన్నుతున్నారు. వైఎస్ జగన్ దృష్టిలో పడాలని.. కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న హడావుడి మామూలుగా ఉండటం లేదు.

ysp mla jogi ramesh in ys jagan cabinet race
ఏది ఏమైనా ఇప్పటికే ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి.. రెండేళ్లు దాటిపోయింది. అధికారంలోకి వచ్చాక.. మొదటి సారి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. రెండున్నర ఏళ్ల తర్వాత మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని.. ఎవ్వరూ అసంతృప్తి చెందొద్దని.. మొదటి సారి అవకాశం రానివాళ్లకు.. రెండోసారి అవకాశం కల్పిస్తామని సీఎం జగన్ కొందరు ఎమ్మెల్యేలకు మాటిచ్చారు. దీంతో.. తమకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందా అని కొందరు ఎమ్మెల్యేలు అయితే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం ఇప్పుడు రానే వచ్చింది.
అందుకే.. ఈసారి ఎలాగైనా మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కించుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే.. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో బెర్త్ ఖాయం అని అనుకుంటున్న ఎమ్మెల్యేలలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ కూడా ఉన్నారట. నిజానికి.. ఆయనకు కొంచెం దూకుడు ఎక్కువే. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. అలాగే.. ఆయన రెండో సారి పెడనలో గెలిచారు. అలాగే.. ప్రతిపక్షాలను విమర్శించాలన్నా.. వాళ్లపై ఆరోపణలు చేయాలన్నా.. జోగి రమేశ్ ముందుంటారు. అందుకే రెండోసారి ఆయనకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ దృష్టిలో పడాలని ఆయన అసెంబ్లీలో చేసిన రచ్చ కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ చూస్తుంటే.. ఈసారి ఎలాగైనా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని జోగి తెగ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
YS Jagan cabinet : జోగి రమేశ్ ను తీసుకోవాలంటే.. ఆ ముగ్గురు మంత్రుల్లో ఒకరిని తొలగించాల్సిందే?
అయితే.. వైఎస్ జగన్ కేబినేట్ లోకి జోగి రమేశ్ రావాలంటే.. అదే కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్.. ఈ ముగ్గురిలో ఒకరిని తప్పించాల్సి వస్తుంది. అయితే.. ప్రస్తుతం ఈ ముగ్గురు మంత్రుల పనితీరు కూడా బాగానే ఉంది. అలాగని.. ఈ ముగ్గురు ఉంటే.. జోగి రమేశ్ ను కేబినేట్ లోకి చేర్చుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే.. కృష్ణా జిల్లా నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. అలాగే.. అదే కృష్ణా జిల్లాకు చెందిన చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి కోసం ఆశపడుతున్నారు. ఈనేపథ్యంలో సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.