YS Jagan : టీడీపీది దోచుకునే తీరు.! వైసీపీది పంచిపెట్టే తీరు: వైఎస్ జగన్.!
YS Jagan : వైసీపీ హయాంలో డీబీటీ విధానం అమలు చేస్తున్నామనీ, తెలుగుదేశం పార్టీ హయాంలో డీపీటీ విధానం అమలయ్యేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కాపు నేస్తం నిధుల్ని విడుదల చేసే క్రమంలో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో అవినీతికి తావు లేకుండా, నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును పంపిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు మద్యవర్తుల అవసరమే లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు పడుతోందని అన్నారు వైఎస్ జగన్. అదే, టీడీపీ హయాంలో జరిగిన పద్ధతి వేరే అని ఎద్దేవా చేశారు వైఎస్ జగన్.
‘‘చంద్రబాబు హయాంలో డీపీటీ పద్ధతి అవలంబించారు. డీపీటీ అంటే ఏంటో తెలుసా.? డీ అంటే దోచుకో.. పీ అంటే పంచుకో.. టి అంటే తినుకో..’’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. అప్పుడూ ఇప్పుడూ ఒకే తరహా బడ్జెట్ వున్నా, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా అమలు చేయగలుగుతున్నామనీ, అవినీతికి తావు లేకుండా చేయడం వల్లే ఇది సాధ్యమయ్యిందనీ, దుష్ట చతుష్టయం, దత్త పుత్రుడు.. కుట్రలు చేస్తున్నారనీ, టీడీపీకి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనీ, వారందరి పట్ల అప్రమత్తంగా వుండాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా, కాపు సామాజిక వర్గానికి వైసీపీ హయాంలోనే న్యాయం జరిగిందనీ, కాపు సామాజిక వర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో అప్రమత్తంగా వుండాలని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు వ్యాఖ్యానిస్తోన్న విషయం విదితమే.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపు సామాజిక వర్గం ఓట్లను టీడీపీకి వేయించాలని చూస్తున్నారనీ, అందుకే చంద్రబాబుకి పవన్ దత్త పుత్రుడని తాము విమర్శిస్తున్నామని వైసీపీ అంటోంది. ‘ఎవరేమనుకున్నా మేం వైసీపీకి అండగా వుంటాం..’ అంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన లబ్దిదారులు ముఖ్యమంత్రి సమక్షంలోనే చెప్పడం గమనార్హం.