YS Jagan : ఏపీలో ఏం జరుగుతోంది? కేబినేట్ మంత్రులు ఎందుకు ఇలా అడ్డంగా దొరికిపోతున్నారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : ఏపీలో ఏం జరుగుతోంది? కేబినేట్ మంత్రులు ఎందుకు ఇలా అడ్డంగా దొరికిపోతున్నారు?

 Authored By sukanya | The Telugu News | Updated on :3 September 2021,5:20 pm

YS Jagan ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి వరుస గండాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పాలన అస్తవ్యస్థమైందనే ఆరోపణలు వస్తుండగా… కేబినెట్ మంత్రులు చిక్కుల్లో పడుతున్నారు. ఇటీవలే హోంమంత్రి మేకతోటి సుచరితపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. కలెక్టర్ విచారణలో ఫిర్యాదులో ఉన్నది నిజమని తేలితే సుచరిత పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది.

తాజాగా మరో ఏపీ మంత్రి పదవి గండం తలెత్తింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేశ్‌, ఆయన సతీమణి ఐఆర్‌ఎస్‌ అధికారి టీఎన్‌ విజయలక్ష్మిపై ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనంఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Ysrcp

Ysrcp

ఆదిమూలపు రాజీనామా? YS Jagan

ఐఆర్ఎస్ గా పనిచేసిన ఆదిమూలపు సురేశ్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ఐఆర్ఎస్ అధికారులపై సీబీఐ 2016లో దాడులు చేసింది. ఈ క్రమంలోనే 2017లో సురేశ్, ఆయన భార్య విజయలక్ష్మిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో విజయలక్ష్మిని ఏ1గా, సురేశ్ ను ఏ2గా పేర్కొన్నారు. అయితే.. తమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, దీనిని కొట్టి వేయాలని కోరుతూ.. సురేశ్‌ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

అక్కడ వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై జరిగిన విచారణలో సీబీఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలపై పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఆయా విషయాలను అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని, ప్రాథమిక విచారణ అవసరం లేదని సీబీఐ భావించిందా? అని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు వర్చువల్‌ విధానంలో ఈ కేసును విచారించిందని పేర్కొన్న ధర్మాసనం.. ఆతీర్పును పక్కన పెడుతున్నామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ జరిపారో లేదో సమాధానం చెప్పాలని సీబీఐని కోరింది.

ys jagan

ys jagan

రాజీనామాకు డిమాండ్.. YS Jagan

అదేసమయంలో మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ పై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది. మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆయన సతీమణి విజయలక్ష్మి అక్రమాస్తులు కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై గతంలో సురేశ్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారన్నారు.

సుప్రీంకోర్టు ఆయన అవినీతి, అక్రమాస్తులపై స్పందించిన నేపథ్యంలో మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు. ప్రతి దానికి సీబీసీఐడీ విచారణలు జరిపించే ముఖ్యమంత్రి జగన్, మంత్రి ఆయన భార్య అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలన్నారు. సురేశ్ అవినీతి తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమన్నారు. సురేశ్ లాంటి వ్యక్తులు మంత్రిగా ఉంటే భావిభారత పౌరులుగా మారాల్సిన విద్యార్థులు దారి తప్పే ప్రమాదముందని వీరాంజనేయస్వామి అన్నారు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది