విశాఖ దెబ్బకు తిరుపతిలో తోకముడుస్తున్న బీజేపీ.. !
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఏమిటో అందరికి తెలుసు. సొంతగా పది పంచాయితీ స్థానాల్లో కూడా గెలవలేని ఆ పార్టీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి టిక్కెట్ తమకే కావాలని జనసేన తో పోటీ పడుతుంది. ఇలాంటి స్థితిలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రము తీసుకున్న నిర్ణయం ఆంధ్ర బీజేపీకి తలనొప్పులు తీసుకోని వచ్చింది.
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరపటానికి ఎన్నికల సంఘం సిద్దమై నోటిఫికెషన్ విడుదల చేసింది. దీనితో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే గతంలో తిరుపతి టిక్కెట్ కోసం చూపించిన ఉత్సహం రాష్ట్ర బీజేపీ ఇప్పుడు చూపించటం లేదని తెలుస్తుంది.
బీజేపీకి ఉక్కు సంకెళ్లు
విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల యావత్తు ఆంధ్రాలు ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి స్థితిలో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేస్తే చిత్తుగా ఓడిపోవటం ఖాయమని బీజేపీ నేతలకు అర్థమైంది. దీనితో తమ మిత్ర పక్షమైన జనసేనకు ఆ స్థానంలో పోటీచేసే అవకాశం ఇవ్వాలని బీజేపీ నిర్ణహించినట్లు తెలుస్తుంది.
అయితే బీజేపీ పార్టీ తిరుపతి సీటు విషయంలో వెనక్కి తగ్గటానికి విశాఖ ఉక్కు విషయం ఒక్కటే కాదని తెలుస్తుంది. ఇటీవల ఐదు బలిజ సంఘాలు చంద్రగిరిలో సమావేశమై, తిరుపతి ఎంపీ సీటును జనసేనకు కేటాయించాలని, ఒకవేళ ఇవ్వకపోతే తమ సామాజిక వర్గీయులంతా నోటాకు ఓటు వేస్తామని హెచ్చరించారు. తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే, మిత్రపక్షమైన జనసేనకే కేటాయించి, గౌరవాన్ని కాపాడుకోవడం మంచిదనే అభిప్రాయంలో బీజేపీ నేతలు ఉన్నారని తెలిసింది.
జనసేన పార్టీ ఆ వర్గం ఓట్లు ఉన్నాయి కాబట్టి, అవి వచ్చిన కొంచం పరువు నిలబెట్టుకున్నట్లు అవుతుంది. ఆలా కాకుండా పోటీకి దిగితే ఇటు విశాఖ ఉక్కు ఎఫెక్ట్ అటు బలిజ సంఘాల వ్యతిరేకత మూలంగా దారుణమైన పరాభవం ముట్టకట్టుకోవాల్సి వస్తుంది అనే భయం బీజేపీ నేతలకు కలగటంతో మెల్లగా తిరుపతి విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీ కలిసి పోటీచేసిన కానీ విశాఖ ఉక్కు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ తో జనసేన ఎన్నికలకు వెళితే కేంద్రం తీసుకున్న నిర్ణయం మీద పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రాన్ని కాదని పవన్ చేసేది ఏమి లేదు.. బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించే సత్తా కూడా లేదు. దీనితో ప్రజల ముందు జనసేనాని కూడా దోషిలాగా నిలబడాల్సి రావచ్చు. అదే సమయంలో ఇతర పార్టీలు ఈ విషయాన్నీ హైలైట్ చేస్తూ జనసేనను బీజేపీ ని కార్నర్ కూడా చేసే అవకాశం లేకపోలేదు.