USA-Iran: నాపై హత్యాయత్నమే జరిగితే..ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్ వార్నింగ్
ప్రధానాంశాలు:
USA-Iran: నాపై హత్యాయత్నమే జరిగితే..ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్ వార్నింగ్
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి అందులో ఇరాన్ పాత్ర ఉందని నిర్ధారణ అయితే ఆ దేశాన్ని భూమిపై నుంచి పూర్తిగా తుడిచివేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. తన భద్రత విషయంలో అమెరికా ఎలాంటి రాజీ పడదని అవసరమైతే అత్యంత కఠిన చర్యలకు కూడా సిద్ధమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇది కేవలం హెచ్చరిక కాదని ముందస్తు ఆదేశమేనని ఆయన మాటలు తీవ్రతను చాటుతున్నాయి.
USA-Iran: నాపై హత్యాయత్నమే జరిగితే..ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్ వార్నింగ్
ఇరాన్ కౌంటర్ వార్నింగ్: చేతిని నరికేస్తాం
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ నుంచి ఘాటు స్పందన వచ్చింది. ఇరాన్ భద్రతా దళాల ప్రతినిధి మాట్లాడుతూ..తమ దేశంపై లేదా తమ నాయకత్వంపై ఎవరైనా దురాక్రమణకు ప్రయత్నిస్తే ఆ చేయిని నరికేస్తామని హెచ్చరించారు. ట్రంప్‌కు తమ సామర్థ్యం బాగా తెలుసని ఒకవేళ అమెరికా దాడులకు పాల్పడితే వారి ప్రపంచాన్నే తగలబెట్టే శక్తి తమకు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయనే సంకేతంగా మారాయి. ఇప్పటికే దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ విభేదాలు ఇప్పుడు మరింత ప్రమాదకర దశకు చేరుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇరాన్ నిరసనలు, ఖమేనీ ఆరోపణలు
ఇదిలా ఉండగా డిసెంబర్ నెల నుంచి ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పాలక వ్యవస్థపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడే కారణమని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఆరోపించారు. ఈ నిరసనల వెనుక అమెరికా కుట్ర ఉందని ఆయన విమర్శించారు. మరోవైపు ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ బహిరంగంగా నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. ఖమేనీ సుదీర్ఘ పాలన ముగియాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఏదైనా దాడి జరిగితే దానికి తగిన రీతిలో ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇక నిరసనల విషయంలోనూ కలవరపెట్టే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు సుమారు 5 వేల మంది మృతి చెందినట్లు దాదాపు 26 వేల మందిని అరెస్టు చేసినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ మరణాలకు అమెరికానే బాధ్యత వహించాలంటూ ఖమేనీ ఆరోపించారు. ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ ప్రతిస్పందనలు, అంతర్గత నిరసనలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ప్రపంచ శాంతికి ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.