రేవంత్ రెడ్డికి చెక్ పెట్టె విధంగా కేసీఆర్ పావులు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పార్టీలో కొత్త ఉత్సహం కనిపిస్తుంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్కడ లేని కళ కనిపిస్తుంది. దానికి ముమ్మాటికీ రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. దీనితో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉత్తేజం కాబోతుంది అనేది నిజం. అదే కనుక జరిగితే సీఎం కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.
తెలంగాణాలో కాంగ్రెస్ చిరునామా లేకుండా చేయాలనీ కేసీఆర్ కంకణం కట్టుకున్న మాట వాస్తవం. దీనితో 2018 తర్వాత ఎక్కువగా వలసలను ప్రోత్సహించి కాంగ్రెస్ ను నిర్వీర్యం చేశాడు. అదే సమయంలో మరోపక్క బీజేపీ గట్టిగానే పుంజుకొని తెరాస కు పోటీగా ఎదిగే విధంగా అడుగులు వేసింది. ఇక దాదాపుగా కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకుంటున్నా సమయంలో రేవంత్ రెడ్డి తెర మీదకు వచ్చి, కాంగ్రెస్ ను రేస్ లో నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఓటుకు నోటు
దీనితో అలెర్ట్ అయిన కేసీఆర్ తనదైన శైలిలో రేవంత్ రెడ్డి కి చెక్ పెట్టేవిధంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి ఉన్న ఏకైక మార్గం ఓటుకు నోటు కేసు. ఇందులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే, దీని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కాదని ముందు బుకాయించిన బాబు ఉన్నపళంగా పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలేసి కరకట్టకు వెళ్ళిపోయాడు. దీనితో ఆ కేసు కూడా మెల్లగా పక్కకు జరిగింది. ఓటుకు నోటు కేసు పక్కన పెట్టారు తప్పితే, క్లోజ్ చేయలేదు.
ఇప్పుడు మరోసారి దాని అవసరం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కేసులో రేవంత్ రెడ్డి బుక్ అయ్యాడు కాబట్టి, విచారణ జరిగి అసలు లెక్కలు బయట పడితే రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయం. పైగా రేవంత్ రెడ్డిని కట్టడి చేయటానికి కేసీఆర్ కు ఉన్న బాణం అదొక్కటే. అందుకే ఇప్పుడు మళ్ళీ దానిని తెర మీదకు తెచ్చి, రేవంత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపిస్తే మాత్రం ఒక రకంగా అది రేవంత్ కు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు.
సెంటిమెంట్ రాజకీయం
తెలంగాణలో సెంటిమెంట్, సానుభూతి రెండు ఎక్కువే. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే అది సానుభూతి రూపంలో మారే ఛాన్స్ కొట్టిపారేయలేము. పైగా కింద పడ్డ నాదే పైచెయ్యి అని చెప్పుకుంటే రేవంత్ ఈ ఇష్యూ ను హైలైట్ చేసి తనకు కావాల్సిన మైలేజ్ వచ్చేలా చేసుకోవటం పక్క. ఇవన్నీ కేసీఆర్ కు తెలియనని కావు. కానీ ఆయన మొండిగా ముందుకు వెళితే చేసేది ఏమి లేదు. ఈటెల విషయంలో సానుభూతి వస్తుందని తెలిసిన కానీ మంత్రి పదవి నుండి తొలిగించి పార్టీ నుండి బయటకు పంపిన విషయం మనం మర్చిపోకూడదు.