MLA Rajaiah : కేటీఆర్ ఎఫెక్ట్.. రూటు మార్చిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య
MLA Rajaiah : తెలంగాణలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికలకు మూడు నెలలకు ముందే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించింది. మరో నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. అయితే.. ప్రకటించిన వారిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించారు గులాబీ బాస్ కేసీఆర్. అందులో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఉండగా.. ఆయన్ను కాదని బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ను కడియం శ్రీహరికి ఇచ్చింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియానికి ఎలా టికెట్ ఇస్తారంటూ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్ హైకమాండ్ పై ఫైర్ అయ్యారు. అయితే.. సర్పంచ్ నవ్య వివాదం వల్లనే రాజయ్యకు టికెట్ రాలేదని తెలుస్తోంది. దీంతో రాజయ్య పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో ఒకవేళ ఆయన పార్టీ మారితే గనుక అది ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ అవుతుంది. అది కడియం గెలుపు మీద కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్ రాజయ్యను సెట్ రైట్ చేశారు. తాజాగా రాజయ్య, కడియం ఇద్దరినీ ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడారు.
MLA Rajaiah : తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్ గా అవకాశం ఇవ్వనున్నారా?
అయితే.. రాజయ్య, కడియం ఇద్దరితో మాట్లాడిన కేటీఆర్.. ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చారు. రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గా నియమిస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో రాజయ్య వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థి కడియానికి మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. వెంటనే రూటు మార్చి కడియం అభ్యర్థిత్వానికి జై కొట్టి.. ఆయన గెలుపునకు, నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అని రాజయ్య కేటీఆర్ కు మాటిచ్చారు. దీంతో స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ లొల్లి ఒక కొలిక్కి వచ్చినట్టు అయింది.