Ys Jagan : వైఎస్ జగన్ గాలం వేస్తున్న బీజేపీ.. మూడే కోర్కెలు అంటున్న సీఎం
Ys Jagan : ఏపీలో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. తొలుత టీడీపీతో దోస్తీ కట్టింది.. అది పెద్దగా లాభించలేదు.. ఆ తర్వాత పవర్ స్టార్ తో జత కట్టినా, పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.. అందుకే ఇప్పుడు పెద్ద చేపనే పట్టాలని ప్లాన్ వేసిందట.. ఏపీలో బీజేపీ టీడీపీతో మొదలెట్టి మరెక్కడో జనసేనతో పొత్తు కట్టి చివరికి వైసీపీ దగ్గర తేలుతుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఏపీలో బీజేపీకి బెస్ట్ ఫ్రెండ్ జగన్ అన్న అభిప్రాయంలో కమలం హైకమాండ్ వచ్చేసిందట. ఈమేరకు తాజాగా సాగుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కమలానికి ఫ్యాన్ గాలిని జత చేర్చాలని కమలనాథులు సీరియస్ గా ఆలోచిస్తున్నారట.
వైఎస్ జగన్ ఉంటే సౌత్ లో ముఖ్యంగా ఏపీలో కొత్త బలం వస్తుందని బీజేపీ గట్టిగా నమ్ముతోందిట. నిజానికి ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీ నేతలు కోరుతున్నది అదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ పుంజుకునే పరిస్థితి లేదు.. అందుకే అధికారపక్షాన్ని మంచి చేసుకోవాలని భావిస్తోందట. అయితే ఈ దోస్తీ ఏపీలో కాదట.. ఢిల్లీలోనట.. అక్కడి నుంచే మానిటర్ చేసేద్దామని బీజేపీ పెద్దల ఆలోచన. అందుకే ఎన్డీయేలో వైసీపీ చేరిపోవాలని పదే పదే అడుగుతున్నారట. జగన్ మాత్రం ఇపుడు కాదు అంటూ తప్పించుకుంటున్నారు.
Ys Jagan : వైఎస్ జగన్ మూడు కోర్కెలు
ఇదే కీలకాంశంగా భావిస్తోన్న మోడీ .. ఇక మీదట జగన్ ఇప్పుడు కాదంటూ తప్పించుకోకుండా లాక్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే ఏపీలో జగన్ సర్కార్ రెండేళ్ల కాలాన్ని మే నెలతో పూర్తి చేసుకోనుంది. ఆనాటికి జగన్ ఎన్డీయేలో మిత్రుడిగా ఉంటారని కూడా కచ్చితంగా లెక్కలేసి మరీ బీజేపీ పెద్దలు చెబుతున్నారట. జగన్ ఎన్డీయేలో చేరడానికి కొన్ని షరతులు విధించారని కూడా అంటున్నారు. అవేంటి అంటే ముందుగా ప్రత్యేక హోదాను ఏపీకి ప్రకటించాలి. ఎటువంటి కొర్రీలు లేకుండా సకాలంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూడాలి. ఇక విభజన హామీల మేరకు ఏపీకి రావాల్సినవి అన్నీ నెరవేర్చాలి. రెవిన్యూ లోటును కూడా పూర్తిగా భర్తీ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలి. ఇలాంటివి కనుక బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే జగన్ ఎన్డీయేలో చేరిపోవడం ఖాయమని అంటున్నారు. జగన్ కి కూడా తిరుపతి ఉప ఎన్నిక తరువాత మరో మూడేళ్ళ వరకూ ఏపీలో ఏ రకమైన ఎన్నికలు లేవు. దాంతో కేంద్రంతో దోస్తీ చేస్తూ ఏపీ ప్రగతిని చూసుకోవాలన్నది జగన్ మాస్టర్ ప్లాన్ గా ఉంది అంటున్నారు.
ఇక బీజేపీకి అర్జంటుగా వైఎస్ జగన్ కావాల్సిరావడం ఆశ్చర్యకరమైన పరిణామమేదీ లేదు కానీ .. వచ్చే రాజకీయ సునామీని తట్టుకోవాలంటే మాత్రం జగన్ మద్ధతు కావాలట. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సహా అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి అసోం తప్ప మిగిలిన వాటిలో ఖాతా తెరచే సీన్ లేదు. ఇక మమతా బెనర్జీ మరో మారు అధికారంలోకి వస్తే దేశంలో మూడో కూటమికి రంగం సిధ్ధమవడం ఖాయం. దీనికి దీదీనే లీడ్ రోల్ లోకి దిగుతారన్నది మరో అంచనా.
దీనిలోకి గనుక వైఎస్ జగన్, కేసీఆర్ చేరితే, ఈ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న బీజేపీకి మరింత కష్టకాలం రావడమే కాకుండా, కేంద్రంలో కూడా చిక్కుల్లో పడుతుంది. అందుకే ముందుగా వైఎస్ జగన్ ని ఎన్డీయేలోకి ఆహ్వానించి బలోపేతం చేసుకోవాలన్నది బీజేపీ హైకమాండ్ ప్లాన్.. అయితే ఇదంతా ఆలోచించే, జగన్ సైతం ఆ టైం వచ్చేవరకు వెయిట్ చేయించాలని కూడా అనుకుంటున్నారట. తెలంగాణలో బీజేపీ నెక్ట్స్ లీడ్ రోల్ గ్యారంటీ అని పెద్దల భావం.. ఇక ఏపీలో జగన్ ను గుప్పిట్లో పెట్టుకుని, మూడో కూటమికి దూరం చేయడం ద్వారా దక్షిణాదిన తమ పట్టును కాపాడుకోవాలన్నది కమల నాథుల .. యోచనట. మరి దీనికి జగన్ నుంచి ఏవిధంగా మద్ధతు వస్తుందో వేచి చూడాల్సిందే.