Prashant Kishor : రాజకీయ పార్టీలకి సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ అన్ని కోట్లు తీసుకుంటారా ?
Prashant Kishor : ఇటీవల చాలా మంది రాజకీయ నాయకులు వ్యూహకర్తలపై ఆధారపడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు.2019 ఎలక్షన్స్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ (పీకె) పేరు బలంగా వినిపించింది.. ఆయన ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. ఈ క్రమంలో తాను ఒక ఎన్నికలో సలహాలు ఇస్తే ఫీజు రూ.100 కోట్లకు పైగా వసూలు చేస్తానని చెప్పారు పీకె.
Prashant Kishor అంత అందుకుంటాడా..!
పీకే సలహాలతో ఎన్నో పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగాయి. అందుకే ఆయన ఎన్నికల వ్యూహానికి తిరుగుండదు అనేది చాలా మంది అభిప్రాయం. తాజాగా తాను ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడికి సలహాలిచ్చేందుకు ఎంత తీసుకుంటారనే వివరాలను ఆయన స్వయంగా వెల్లడించారు. రూ. 100 కోట్లకు పైగా తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. బీహార్‌లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిశోర్ తన ఫీజు వివరాలను వెల్లడించారు. బెలగంజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎన్నికల ప్రచారాలకు ఎలా నిధులు సమకూరుస్తారో చెప్పాలని ప్రజలు తనను తరచుగా అడుగుతారని ఆయన పేర్కొన్నారు. వాటికి సమాధానంగా ఇప్పుడిలా తన ఫీజు వివరాలను ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.
తన ప్రచార కార్యక్రమాల్లో టెంట్లు, స్టేజ్ లు వేయడానికి తన దగ్గర డబ్బు సరిపోదని అనుకుంటున్నారా.. తాను అంత బలహీనుడిని అని భావిస్తున్నారా అని ప్రశ్నించిన పీకే… తాను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తె రూ.100 కోట్లు, లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటానని.. వాటితోనే తన ఎన్నికల ప్రచారాలకు నిధులు సమకూర్చుకో గలుగుతున్నానని అన్నారు. కాగా… బీహార్ లో నవంబర్ 13న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో పోటీ చేయడానికి జన సూరజ్ అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో భాగంగా.. బెలగంజ్ నుంచి మహ్మద్ అంజాద్.. ఇమాంగంజ్ నుంచి జితేంద్ర, రాంగఢ్ నుంచి సుశీల్, తరారీ నుంచి కిరణ్ సింగ్ బరిలోకి దిగారు! . నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడవుతాయి.