Revanth Reddy : ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. మంత్రులుగా ప్రమాణం చేసింది వీళ్లే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.. మంత్రులుగా ప్రమాణం చేసింది వీళ్లే

Revanth Reddy : ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అని రేవంత్ రెడ్డి అనగానే ఒక్కసారిగా ఎల్బీ స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. అందరూ ఒక్కసారిగా సంతోషంగా గట్టిగా కేకలు వేశారు. ఇవాళ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 December 2023,2:15 pm

ప్రధానాంశాలు:

  •  తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి

  •  డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణం

  •  మంత్రులుగా 10 మంది ప్రమాణ స్వీకారం

Revanth Reddy : ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అని రేవంత్ రెడ్డి అనగానే ఒక్కసారిగా ఎల్బీ స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. అందరూ ఒక్కసారిగా సంతోషంగా గట్టిగా కేకలు వేశారు. ఇవాళ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అని రేవంత్ రెడ్డి చెప్పగానే ఎల్బీ స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆ తర్వాత ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప, ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగానే కానీ ఏ వ్యక్తులకు తెలియపరచనని, లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి అనంతరం తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా సంతకం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

Revanth Reddy : డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క

ఆ తర్వాత భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

భట్టి విక్రమార్క రాజకీయ ప్రస్థానం

భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే. 2007 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2009 నుంచి 2011 వరకు చీఫ్ విప్ గా ఉన్నారు. 2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. 2018 నుంచి 2023 వరకు సీఎల్పీ నేతగా ఉన్నారు. సౌమ్యుడు, వివాద రహితుడుగా పేరు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

ఉత్తమ్ కుమార్ రెడ్డిది హుజూర్ నగర్ నియోజకవర్గం. ఆయన రెండు సార్లు కోదాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు సార్లు హుజూర్ నగర్ ఎమ్మెల్యే అయ్యారు. 2019 లో నల్గొండ ఎంపీగా గెలిచారు. 2015 నుంచి 2021 వరకు టీపీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినేట్ లో మంత్రిగా పని చేశారు. ఉత్తమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పని చేశారు.

దామోదర రాజనరసింహ రాజకీయ ప్రస్థానం

సిలారపు దామోదర రాజనరసింహది ఆందోల్ నియోజకవర్గం. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. 1989 లో ఆందోల్ నుంచి తొలిసారి గెలిచారు. 2004, 2009 లో వరుసగా గెలిచారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ప్రాథమిక విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 లో మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రిగా ఉన్నారు. 2011 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఏపీకి చివరి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. 2023 లో 28 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది నల్గొండ నియోజకవర్గం. ఎన్ఎస్‌యూఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముగ్గురు సీఎంల కేబినేట్లలో మంత్రిగా ఉన్నారు. 2011 లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2019 లో భువనగిరి ఎంపీగా గెలుపొందారు. స్టార్ క్యాంపెయినర్, స్క్రీనింగ్ కమిటీ మెంబర్ గా వ్యవహరించారు.

దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాజకీయ ప్రస్థానం

మంథని నియోజకవర్గానికి చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. మంథని నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ వ్యవహారాలు చూసుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ప్రభుత్వ విప్ గా ఉన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

పాలేరు నియోజకవర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2013 లో వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా 2014 లో గెలిచారు. కొంత కాలం పాటు తెలంగాణ వైసీపీకి అధ్యక్షులుగా కొనసాగారు. ఆ తర్వాత వైసీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరి 2023 ఎన్నికల్లో పాలేరు నుంచి ఘనవిజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు.

పొన్నం ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం

పొన్నం ప్రభాకర్ ది హుస్నాబాద్ నియోజకవర్గం. 2009 లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. చిన్నవయసులోనే ఎంపీ అయ్యారు. రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు.

కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం

వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన కొండా సురేఖ ఎంపీపీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 10996లో పీసీసీ సభ్యురాలుగా ఉన్నారు. మూడు వేర్వేరు స్థానాల నుంచి ఎమ్మెల్యేగా వైఎస్ కేబినేట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 లో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సీతక్క రాజకీయ ప్రస్థానం

ములుగు నియోజకవర్గానికి చెందిన సీతక్క దశాబ్దానికి పైగా మావోయిస్టుగా పని చేశారు. 2004 లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009 లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 లో ములుగు నుంచి ఓడిపోయారు. 2018, 2023 లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం

ఖమ్మం నియోజకవర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు 1983 లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. సత్తుపల్లి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2015 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ముగ్గురు సీఎంల కేబినేట్లలో మంత్రిగా పని చేశారు.

జూపల్లి కృష్ణారావు రాజకీయ ప్రస్థానం

కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011 లో టీఆర్ఎస్ లో చేరారు. 2014 లో కొల్లాపూర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 లో టీఆర్ఎస్ మొదటి టర్మ్ లో మంత్రిగా పని చేశారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. వైఎస్సార్, కిరణ్ కేబినేట్ లోనూ మంత్రిగా పని చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది