Telangana BJP : జనసేనతో పొత్తు వద్దే వద్దు.. దిక్కుతోచని స్థితిలో తెలంగాణ బీజేపీ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana BJP : జనసేనతో పొత్తు వద్దే వద్దు.. దిక్కుతోచని స్థితిలో తెలంగాణ బీజేపీ?

 Authored By kranthi | The Telugu News | Updated on :28 October 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  గ్రేటర్ పరిధిలో జనసేనకు టికెట్ల కేటాయింపు

  •  ఆయా నియోజకవర్గాల బీజేపీ ఆశావహుల నుంచి వ్యతిరేకత

  •  జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి నష్టమా? లాభమా?

Telangana BJP : ఒక ఆరు నెలల కింద తెలంగాణలో రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ.. ఇప్పుడు చూస్తే రాజకీయాలు మొత్తం మారిపోయాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే అది బీజేపీనే అనుకున్నారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు బీజేపీ దూసుకుపోయింది. బీఆర్ఎస్ ను ఓడించి ఈసారి బీజేపీ గెలిచి తీరుతుందని అంతా భావించారు. బీజేపీలోకి కీలక నేతలు కూడా వెళ్లారు. కానీ.. ఎప్పుడైతే బీజేపీ చీఫ్ ను మార్చారో అప్పటి నుంచి బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. తెలంగాణలో ఎన్నికల ముందు బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ చీఫ్ ను మార్చడమే కాదు.. తెలంగాణలో బీజేపీ చాలా విషయాల్లో తొందరపాటు వల్ల తెలంగాణ ప్రజలకు ఆ పార్టీపై ఉన్న నమ్మకం కాస్త రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. చివరకు ఆ పార్టీ పరిస్థితి ఎలా అయింది అంటే ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నా ఇప్పటికీ అభ్యర్థులను కూడా ప్రకటించలేకపోయింది బీజేపీ. పూర్తిస్థాయిలో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు జనసేనతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న ఆలోచన దగ్గరే ఉండిపోయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. రెండో స్థానంలో ఉన్న బీజేపీని కిందికి లాగి.. ఆ ప్లేస్ ను ఆక్రమించుకుంది కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అంటే కనిపించేది కాంగ్రెస్ మాత్రమే.

కర్ణాటకలో అధికారంలోకి రావడం దగ్గర్నుంచి కాంగ్రెస్ పార్టీ జాతకమే మారిపోయింది. తెలంగాణ మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా పెరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఎదుర్కొని బీజేపీ నిలబడగలదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న? తెలంగాణలో జనసేన, సీపీఐ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఇక.. బీజేపీకి ఉన్న దిక్కు జనసేన మాత్రమే. తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ అమిత్ షాను కూడా కలిశారు. అయితే.. బీజేపీ జనసేన పొత్తు ప్రధానంగా గ్రేటర్ పరిధిలోనే ఉండనుందట. అంటే.. ఐటీ కారిడార్ లో కొన్ని సీట్లను జనసేనకు బీజేపీ కేటాయించనుందట. ఆ నియోజకవర్గాల బీజేపీ ఆశావహులు అసంతృప్తిని లోనుకానున్నారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు గ్రేటర్ పరిధి కిందికే వస్తాయి. ఈ నియోజకవర్గాల్లో జనసేన ప్రాబల్యం ఎక్కువగా ఉందని.. అందుకే ఈ నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్ కేటాయించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Telangana BJP : పొత్తు పెట్టుకుంటే బీజేపీకే నష్టం అంటున్న ఆశావహులు

చాలా ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడ్డామని.. ఇలా ఇప్పుడు సడెన్ గా ఈ నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్ ఇవ్వడమేంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జనసేనతో పొత్తు వద్దు అని కొందరు నేతలు బీజేపీ హైకమాండ్ కు విన్నవిస్తున్నారట. పార్టీకి మరింత డ్యామేజీ చేసేలా ఇప్పుడు జనసేనతో పొత్తు వద్దని.. దాని వల్ల అసంతృప్తి నేతల నుంచి వచ్చే వ్యతిరేకత పార్టీ గెలుపుపై ప్రభావం చూపిస్తుందని పార్టీ నేతలు హైకమాండ్ కు విన్నవించినట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ హైకమాండ్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొన్నది. అందుకే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించేందుకు ముందు వెనుకా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది