లోకల్ ప్లేయర్లు ఏరి ? అవకాశం ఇవ్వకపోతే ఐపీఎల్ మ్యాచ్‌లను జరగనివ్వం.. దానం హెచ్చరిక..
Danan Nagender : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలం ప్రక్రియ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఫ్రాంచైజీలు పోటీలు పడి మరీ తమకు కావల్సిన ప్లేయర్లను భారీ ధరలకు కొనుగోలు చేశాయి. అయితే ఈసారి వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తోపాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు లోకల్ టాలెంట్‌ను పూర్తిగా విస్మరించాయి. ఓ వైపు ముంబై ఇండియన్స్ అత్యధిక సంఖ్యలో లోకల్ ప్లేయర్లను టీమ్‌లోకి తీసుకోగా సదరు రెండు జట్లు మాత్రం కనీసం ఒక్క లోకల్ ప్లేయర్‌కు కూడా అవకాశం కల్పించలేదు. దీంతో ఆ రెండు జట్లపై ఆయా ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇదే విషయంపై స్పందించారు. జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌లో ఆయన తాజాగా తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐపీఎల్‌లో హైదరాబాద్ క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటగల క్రికెటర్లు ఎంతో మంది హైదరాబాద్‌లో ఉన్నా స్థానికులకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించాలని చూస్తే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.
స్థానికులకు ఐపీఎల్‌లో అవకాశం కల్పించే విషయమై సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం స్పందించాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. జట్టులోకి కనీసం ఒక్క స్థానిక ప్లేయర్‌ను కూడా తీసుకోకపోవడం సరికాదని, చాలా మంది సత్తా చాటే ప్లేయర్లు ఉన్నారని, బాల్ ట్యాంపరింగ్‌లో దొరికిన డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు కదా.. అని దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జట్టులో లోకల్ ప్లేయర్లకు అవకాశం కల్పించాలని, లేదా జట్టు పేరును అయినా మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. అయితే దీనిపై హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.