Mohammed Siraj : మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. మహమ్మద్ సిరాజ్ సింగిల్ తీసి ఉంటే కథ వేరేలా ఉండేదే..!
Mohammed Siraj : ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇండియా మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. టీ 20 వరల్డ్ కప్‌లో ఓటమి తర్వాత టీమిండియా బంగ్లా గడ్డపై అడుగుపెట్టగా ఇక్కడ మంచి విజయం సాధిస్తారని అందరు ఆశించిన భారత్ అభిమానులకి నిరాశే ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోవలసి వచ్చింది. బుధవారం రోజు ఉత్కంఠగా జరిగిన రెండో వన్డేలో రోహిత్ సేన 5 పరుగుల తేడాతో ఓటమి చెందింది. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, దాదాపు మ్యాచ్ గెలుపు ముంగిట వరకు వచ్చింది.
అయితే ఆ సమయంలో బొటన వేలి గాయంతో రోహిత్ శర్మ(51 నాటౌట్) చేసిన ఒంటరి పోరాటం చేశాడు. జట్టు విజయం కోసం 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో అజేయ హాఫ్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించినంత పని చేశాడు. కానీ మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించలేకపోవడం వలన భారత ఓటమి బాట పట్టింది. రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ సమీకరణం 42 బంతుల్లో 64 పరుగులుగా ఉంది. 46వ ఓవర్‌లో బ్యాటింగ్ సత్తా ఉన్న దీపక్ చాహర్ కూడా ఔటవ్వడంతో భారత ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఎబాదత్ బౌలింగ్‌లో రెండు సిక్స్, ఒక ఫోర్ బాదిన రోహిత్ శర్మ గెలుపుపై ఆశలు చిగురించేలా చేశౄడు.
Mohammed Siraj : సిరాజ్ ఎంత పని చేశావు..!
అయితే మెహ్‌దీ హసన్ వేసిన 47వ ఓవర్‌లో నాలుగు బంతులాడిన సిరాజ్ సింగిల్ తీసి ఇవ్వగా, అనంతరం రెండు బంతులను రోహిత్ డాట్ చేయడంతోఆ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఇక ముస్తాఫిజుర్ వేసిన 48వ ఓవర్‌లో సిరాజ్ ఒక్క పరుగు కూడా చేయలేదు. పూర్తిగా మెయిడిన్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. 46వ ఓవర్, 47వ ఓవర్‌లో సిరాజ్ బ్యాట్‌తో చేసిన తప్పిదం భారత విజయవకాశాలను పూర్తిగా దెబ్బ తీసింది. ఆ ఓవర్‌లో సిరాజ్ సింగిల్ తీసి రోహిత్ స్ట్రైకింగ్‌కు ఇచ్చి ఉండి ఉంటే ఫలితం భారత్ వైపు ఉండేదని కొందరు చెప్పుకొస్తున్నారు.