Telangana Skills University : తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు.. యువతకు ఉపాధి కల్పించడ‌మే ల‌క్ష్యంగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Skills University : తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు.. యువతకు ఉపాధి కల్పించడ‌మే ల‌క్ష్యంగా

 Authored By ramu | The Telugu News | Updated on :19 July 2024,10:10 pm

ప్రధానాంశాలు:

  •  17 కోర్సులు, ఏటా 20 వేల మందికి శిక్షణ

  •  హైదరాబాద్ లోనే మెయిన్ క్యాంపస్.. కంపెనీల భాగస్వామ్యం

  •  ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టే యోచన

Telangana Skills University : తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు ఎంత ఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Telangana Skills University తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ పేరు ఖరారు

స్కిల్ యూనివర్సిటీపై సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించి, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల విభాగం నమూనా ముసాయిదాను తయారు చేసింది.

ఈ యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిర్వహణకు అవసరమయ్యే నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు. కొత్త యూనివర్సిటీ ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’ అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Telangana Skills University 17 కోర్సులు, ఏటా 20వేల మందికి శిక్షణ

ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో (పీపీపీ మోడల్లో) స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పుతారు. లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు. ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్..తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడుతారు. ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది. తొలి ఏడాది రెండు వేల మందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

Telangana Skills University హైదరాబాద్ లోనే క్యాంపస్

హైదరాబాద్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ క్యాంపస్ తోపాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు (శాటిలైట్ క్యాంపస్లు) ఏర్పాటు చేయాలనే చర్చ జరగింది. జిల్లా కేంద్రాల్లో శాటిలైట్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని, అందరూ హైదరాబాద్ క్యాంపస్ లోనే చేరేందుకు పోటీ పడుతారని ముఖ్యమంత్రి అన్నారు.అందుకే హైదరాబాద్ లోనే అందరికీ శిక్షణను అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఈఎస్సీతో పాటు న్యాక్ క్యాంపస్ ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలుండే వివిధ ప్రాంగణాలను గుర్తించాలని సూచించారు. భూదాన్ పోచంపల్లిలో ఉన్న స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న కోర్సులు, అక్కడున్న సదుపాయాలను అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

Telangana Skills University తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు యువతకు ఉపాధి కల్పించడ‌మే ల‌క్ష్యంగా

Telangana Skills University : తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు.. యువతకు ఉపాధి కల్పించడ‌మే ల‌క్ష్యంగా

కచ్చితంగా ఉపాధి కల్పించేలా

డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, అటువంటి కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండాలని చెప్పారు. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని, ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మిగతా యూనివర్సిటీలు అనుసరించిన విధానాలను పరిశీలించి కొత్త యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణాన్ని తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేసి ముసాయిదాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది