Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాలు ఇవే… ఎవరెవరు అర్హులు అంటే..!
ప్రధానాంశాలు:
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాలు ఇవే... ఎవరెవరు అర్హులు అంటే..!
Indiramma Atmiya Bharosa : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ రూ.2 లక్షలు అమలు చేయగా.. తాజాగా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు రెడీ అయింది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే తొలి విడత రూ.6వేల చొప్పున నేరుగా అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు . ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో.. జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. మరి.. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎవరెవరు అర్హులు.. వాళ్లను ఎలా గుర్తించనున్నారు.. ఏ ప్రాతిపదికనా ఈ పథకాన్ని అమలు చేయనున్నారన్నది ఇప్పుడు ప్రజల్లో ఎదురవుతున్న ప్రశ్న.
Indiramma Atmiya Bharosa ఇవి నిబంధనలు..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సుమారు 10 లక్షల మంది అర్హులు ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఇక కసరత్తు చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రంలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని తేల్చింది. సంవత్సరంలో కనీసం 20 రోజులైన ఉపాధి హామీ పనులు చేసిన వారినే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏటా రూ.1200 కోట్ల మేరకు అవసరమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అంచనా వేస్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నిబంధనలు చూస్తే..
ధరణి పొర్టల్‌లో తమ పేరుపై భూమి లేని వారై ఉండాలి. ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ కార్డు లింకై ఉండాలి . 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. గ్రామపంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు. వీటికి అర్హులైన వారే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రెండు దశల్లో రూ.12 వేల ఆర్థిక సాయం పొందుతారు. తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీలో జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామసభ నిర్వహించనున్నారు. ఆధార్ , జాబ్‌కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు అనుసంధానం కాని ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు. వాటిలో తప్పులు దొర్లిన ఉపాధి కూలీలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ తప్పులను ఈనెల 25వ తేదీలోపు సవరించుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు ఆదేశించారు.