Komatireddy Rajagopal Reddy : కాంగ్రెస్ టు బీజేపీ.. బీజేపీ టు కాంగ్రెస్.. మళ్లీ సొంతగూటికి కోమటిరెడ్డి.. బీజేపీలో ఏం జరుగుతోంది?
Komatireddy Rajagopal Reddy : కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కాంగ్రెస్ పార్టీలో ఉండలేక తన పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరి.. బీజేపీ నుంచి ఉపఎన్నికల్లో మునుగోడు అభ్యర్థిగా పోటీ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ.. మునుగోడు ఉపఎన్నికల్లో ఓడిపోయారు. అయినా అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండంతో ఆయన బీజేపీ నుంచి ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆయన మునుగోడుతో పాటు ఎల్బీ నగర్ టికెట్ కూడా ఆశించినట్టు తెలుస్తోంది. కానీ.. ఆయనకు బీజేపీ అధిష్ఠానం కేవలం మునుగోడు నియోజకవర్గం సీటే ఇస్తామని స్పష్టం చేయడంతో రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీని వీడారు.
మళ్లీ తన సొంత గూటికే చేరుకున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు పెరిగాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లిన వాళ్లు తిరిగి మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నారు. కర్ణాటకలో గెలిచిన జోరుతోనే తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ జోరుమీదుంది. తెలంగాణలోనూ పార్టీ క్యాడర్ ఉత్సాహంతో ఉంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. అందులోనూ పార్టీకి ప్రజల నుంచి కూడా భారీగా స్పందన లభిస్తోంది. కీలక నేతలు పార్టీలో చేరుతుండటంతో పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. తాజాగా రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు చాలా ప్లస్ పాయింట్ కాబోతోంది.
ఢిల్లీకి వెళ్లి అక్కడ రాహుల్ గాంధీ సమక్షంలో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. విజయదశమి తర్వాత మంగళవారమే ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతుండటంతో ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.