Mynampally Hanumantha Rao : రేవంత్ రెడ్డితో మైనంపల్లి భేటీ? కాంగ్రెస్‌లో చేరిక ఖాయమేనా?
Mynampally Hanumantha Rao : మూడు నెలల ముందే టికెట్స్ ప్రకటించి తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించాలని సీఎం కేసీఆర్ భావించారు. మూడు నెలల ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్లను ప్రకటించారు సీఎం కేసీఆర్. అంతవరకు బాగానే ఉంది కానీ.. టికెట్ల ప్రకటన తర్వాత ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. టికెట్లు దక్కని ఆశావహులు పార్టీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించడం ఏమో కానీ.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇప్పటికే తమకు టికెట్ దక్కలేదని పలువురు నేతలు పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరు కీలక నేతలు కూడా వేరే పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ దక్కని వాళ్లే కాదు.. టికెట్ దక్కిన వాళ్లు కూడా పార్టీలో అలజడి సృష్టిస్తున్నారు.
మైనంపల్లి హన్మంత రావుకి టికెట్ దక్కినా కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. మంత్రి హరీశ్ రావుపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా ఆయన పేరు ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో ఉంది. దీంతో అందరూ అవాక్కయ్యారు. అదంతా పక్కన పెడితే తన కొడుకు మైనంపల్లి రోహిత్ కి కూడా టికెట్ ఆశించారు మైనంపల్లి హన్మంతరావు. తన కొడుకుకి మెదక్ టికెట్ కావాలని హైకమాండ్ ను ముందే కోరినట్టు తెలుస్తోంది. కానీ.. మధ్యలో హరీశ్ రావు అడ్డుపడటంతో హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మైనంపల్లి.
Mynampally Hanumantha Rao : బీఫామ్ దక్కుతుందా? లేదా?
ఫస్ట్ లిస్టులో మైనంపల్లికి టికెట్ కేటాయించినప్పటికీ ఆయన బీఫామ్ ఇచ్చే వరకు డౌటే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మైనంపల్లి కూడా తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ నేతలు కూడా మైనంపల్లితో టచ్ లోకి వచ్చారు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే తనకు, తన కొడుకు ఇద్దరికీ టికెట్స్ కేటాయించాలని మైనంపల్లి కోరుతున్నారట. కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్ లోకి వస్తే మరి రెండు టికెట్లు కేటాయిస్తారా లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.