Kukatpally Girl Murder Mystery : వీడిన కూకట్‌పల్లి బాలిక మర్డర్ మిస్టరీ..చంపింది ఎవరో తెలుసా..?
Kukatpally Girl Murder Mystery : హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్‌పల్లి బాలిక హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. కేవలం 10 ఏళ్ల వయసున్న సహస్రను దారుణంగా పొడిచి చంపేసిన ఘటన తల్లిదండ్రులను మాత్రమే కాకుండా సమాజాన్ని కుదిపేసింది. తల్లిదండ్రులు పనులకై బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను, పక్క ఇంటి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సహస్ర శరీరంపై 20 వరకు కత్తిపోట్ల గాయాలు ఉండటం ఈ నరమేధం ఎంత భయంకరమో స్పష్టమవుతోంది.
kukatpally girl murder mystery
దర్యాప్తులో నిందితుడు 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అని బయటపడటం మరింత కలవరపరిచింది. ఇంట్లో దేవుడి హుండీని పగులగొట్టి డబ్బు దొంగిలించాలని ముందే ప్రణాళిక వేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అందుకోసం “హౌ టు గైడ్” లా ఒక పేపర్ సిద్ధం చేసుకున్నాడని కూడా తెలుస్తోంది. దోపిడీ ప్రయత్నంలో సహస్ర తనను చూసినందువల్లే, ఆమెను అతి దారుణంగా పొడిచి చంపేశాడని అనుమానిస్తున్నారు. నేరానికి వాడిన కత్తి, రక్తపుమచ్చలతో ఉన్న దుస్తులు, రాసిన నోట్స్ అన్నీ పోలీసులు సీజ్ చేశారు.
చిన్న వయసులోనే ఇంతటి హేయమైన నేరానికి పాల్పడటం సమాజానికి ఆందోళన కలిగిస్తోంది. ఒక చిన్నారి ప్రాణాన్ని హరించిన ఈ ఘటన పిల్లలలో మానసిక స్థైర్యం, విలువల లోపం, కుటుంబ పర్యవేక్షణ అవసరం వంటి అంశాలను మళ్లీ గుర్తుచేస్తోంది. సహస్ర హత్యకు పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించి, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలనే డిమాండ్ ప్రజల నుండి వ్యక్తమవుతోంది.