Supraja Hospital : తాటి చెట్టు ఎక్కి కిందపడి తీవ్రగాయాలైన గీత కార్మికుడికి ఉచితంగా వైద్యం అందించిన నాగోల్ సుప్రజ ఆసుపత్రి
Supraja Hospital : తన వృత్తినే నమ్ముకొని ఎంత కష్టమైనా.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ గీత కార్మికుడు కల్లు గీస్తాడు. తాటి చెట్టు ఎక్కి దిగేవరకు కూడా ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. గీత కార్మికులకు ఏదైనా జరిగితే ఎలా.. తాటి చెట్టు నుంచి కింద పడితే వాళ్లకు ట్రీట్ మెంట్ చేయించాలంటే లక్షలకు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి. గీత కార్మికుల కష్టాలను అర్థం చేసుకున్న హైదరాబాద్ లోని నాగోల్ లో ఉన్న సుప్రజ హాస్పిటల్ యాజమాన్యం కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు గాయపడే వారికి ఉచితంగా ట్రీట్ మెంట్ అందిస్తోంది. ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు తాటి చెట్టు ఎక్కి కింద పడ్డ 34 మందికి సుప్రజ ఆసుపత్రి ఉచితంగా చికిత్స అందించింది.
సుప్రజ ఆసుపత్రి ఎండీ విజయ్ కుమార్ గౌడ్ యాదగిరిగుట్టలో జరిగిన తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు కిందపడే గీత కార్మికులకు తన ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తా అని మాటిచ్చారు. ఆయన మాట ఇచ్చిన ప్రకారం.. ఇప్పటి వరకు 45 లక్షల రూపాయల విలువైన వైద్యాన్ని 34 మందికి ఉచితంగా అందించారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన కోల విష్ణు గౌడ్ అనే గీత కార్మికుడు ఇటీవల కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి చెట్టు మీది నుంచి కింద పడటంతో ఆయన నడుముకి గాయాలయ్యాయి. ఎడమకాలు విరిగింది.
Supraja Hospital : కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయరాములు సాయంతో చికిత్స
ఈ విషయం తెలియగానే.. వెంటనే కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు సహకారంతో చికిత్స కోసం సుప్రజ ఆసుపత్రికి.. బాధితుడిని తీసుకెళ్లారు. వెంటనే సుప్రజ ఆసుపత్రి యాజమాన్యం.. విష్ణు గౌడ్ కు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా గౌడన్నకు చికిత్స చేస్తున్నందుకు విష్ణు గౌడ్, ఆయన కుటుంబ సభ్యులు, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరుపున, యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేజీకేఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కోల వెంకటేష్ గౌడ్ సుప్రజ ఆసుపత్రికి వెళ్లి కోల విష్ణు గౌడ్ ను పరామర్శించి సుప్రజా ఆసుపత్రి ఎండీ విజయ్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.