కాంగ్రెస్ లోకి పొంగులేటి.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం..!!
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ కాబోతున్నారు. జులై రెండవ తారీకు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కంటే భారీ ఎత్తున నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ గ్రాఫ్ చూస్తే ఆయన ఖమ్మం జిల్లాలో తిరుగులేని రాజకీయ నేత అని అందరికీ తెలుసు. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. అందువల్లే వైయస్ జగన్… తెలంగాణ వైసీపీ పార్టీ బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది. కాగా 2014 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా గెలవడం మాత్రమే కాదు తనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు.
అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటినుంచి 2019 వరకు ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా రాణించారు. అయితే ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు సీటు పొంగులేటికి కాకుండా బీఆర్ఎస్ పార్టీ తరపున నామా నాగేశ్వరరావునీ బరిలోకి దింపడం జరిగింది. ఈ క్రమంలో పొంగిలేటికి ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఆ సమయంలో రవాణా శాఖ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు పొంగులేటి వర్గీయుల మీద పెత్తనం చెలాయించటం ప్రారంభించారు. ఈ వివాదానికి సంబంధించి కెసిఆర్ దృష్టికి పొంగిలేటి చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో తన కూతురు పెళ్లికి కెసిఆర్ నీ పొంగులేటి ఆహ్వానించినప్పటికీ ఆయన రాలేదు. అప్పటినుండి పొంగిలేటిలో నైరాస్యం ఆగ్రహం అలుముకుంది.
మరోపక్క మంత్రి ఆగడాలు పెరిగిపోవడంతో పొంగులేటి బీఆర్ఎస్ పార్టీతో తన సంబంధాలను దాదాపు కట్ చేసుకున్నారు. అనంతరం 2023 నూతన సంవత్సర సందర్భంగా పార్టీ అధిష్టానానికి ఆయన వ్యతిరేక స్వరం ప్రారంబించారు. అప్పటినుంచి కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పొంగులేటి అనేక రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. గత ఆరు నెలల నుంచి అనేక చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి పొంగులేటి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.
పైగా మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ ఎత్తున అత్యధిక స్థానాలలో విజయం సాధించటంతో… ఖమ్మం జిల్లాకు చెందిన భారీ క్యాడర్ నీ తన వైపుకు తిప్పుకొని జులై రెండవ తారీకు రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటి కాంగ్రెస్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారనుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.