Black Book : ఏపీలో రెడ్ బుక్, ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ బుక్ హంగామా మొదలైంది.. ఏంటీ రచ్చ..!
Black Book : విద్యార్ధులు కూడా పుస్తకాలు కాకుండా ట్యాబ్, స్మార్ట్ ఫోన్‌లంటూ చదువు కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం బుక్‌లతో కుస్తీలు పడుతున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ బాగా ఫేమస్. యువగళం పాదయాత్ర సమయంలో రెడ్ బుక్ చూపించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… టీడీపీపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులకు వార్నింగ్ ఇవ్వడం మనం చూశాం. వైసీపీకి కొమ్ము కాసే వారిని ఎవరిని వదలనంటూ రెడ్ బుక్‌తో బెదిరించాడు. అనేక ఘటనలతో విసిగిపోయిన నారా లోకేశ్… యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు.
Black Book : బుక్ బెదిరింపులు..
యువగళం పాదయాత్ర సాగినన్ని రోజులు దాదాపు ప్రతి ప్రసంగంలో రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావించారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు పెడుతున్నారని.. అలాంటి పోలీసు అధికారులను వదలబోమని హెచ్చరించారు. తమను వేధిస్తున్న అధికారులందరి పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ సమయంలో సుప్రీంకోర్టులో ఇదే అంశాన్ని ఏపీ సీఐడీ తరఫు లాయర్లు కూడా ప్రస్తావించారు. అయితే ఫలితాల తర్వాత కూడా నారా లోకేశ్ రెడ్ బుక్ గురించి కామెంట్స్ చేశారు. మంగళగిరి సహా పలుచోట్ల ‘రెడ్ బుక్.. సిద్ధం’ పేరిట భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు కూడా వెలిశాయి. ఫలితాల తర్వాత లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ విషయంలో తగ్గేదే లేదన్నారు.
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రకటనలపై వెనక్కి తగ్గబోనని చెప్పారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సమర్థవంతంగా ఎండగడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెళ్లు అయిందో లేదో… ఆ పార్టీకి చెందిన మంత్రులు, నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంటే… కొందరు అధికారులు సహకరిస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌ట్రాలు చేసే అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నామని…. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు.