Revanth Reddy : GEN Z ని తెలివి గా తన బుట్టలో వేసుకుంటున్న రేవంత్ రెడ్డి..!
Revanth Reddy
Revanth Reddy : భారత రాజకీయాల్లో యువతకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే అంశం మరోసారి జాతీయ చర్చగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా ప్రతిపాదన రాజకీయ వర్గాల్లోనే కాకుండా యువతలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. అయితే ఈ పరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించాలని రేవంత్ సూచించారు. అలాగే రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 30 నుంచి 25 సంవత్సరాలకు తగ్గించాలని కూడా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశం కేవలం ఎన్నికల వయస్సును తగ్గించడం మాత్రమే కాదని, డిజిటల్ యుగంలో పెరుగుతున్న యువతకు దేశ పాలనలో ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జెన్-జెడ్ తరం ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త దృక్పథం చట్టసభలకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం యువతను రాజకీయ ర్యాలీలు, నిరసనలు, సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితం చేస్తున్నామని, కానీ నిర్ణయాలు తీసుకునే వేదికల్లో వారికి సరైన అవకాశాలు కల్పించడం లేదని రేవంత్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారాలని, యువత నేరుగా చట్టసభల్లోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Revanth Reddy : GEN Z ని తెలివి గా తన బుట్టలో వేసుకుంటున్న రేవంత్ రెడ్డి..!
Revanth Reddy యువతకు రాజకీయాల్లో అవకాశాలు పెరగాలంటే…
శనివారం నిర్వహించిన క్యాండిల్‌లైట్ ర్యాలీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన ప్రతిపాదనను మరింత విపులంగా వివరించారు. తెలంగాణ అసెంబ్లీలో దీనిపై ప్రత్యేక తీర్మానం ఆమోదించి, రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలంటే కనీస వయస్సు 25 సంవత్సరాలు రాజ్యసభ, శాసన మండలి ఎన్నికలకు 30 సంవత్సరాలు రేవంత్ ప్రతిపాదన ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు 21 సంవత్సరాలు , రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలకు 25 సంవత్సరాలు, ఈ మార్పులతో దేశ యువతకు రాజకీయాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య దేశాల్లో యువ నాయకులు కీలక పదవులు చేపడుతున్నారని, భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే విధానాల రూపకల్పనలో యువత ప్రత్యక్షంగా పాల్గొంటే పాలన మరింత ఆధునికంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై మాట్లాడిన రేవంత్ రెడ్డి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలను కూడా గుర్తు చేశారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారని తెలిపారు. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును కూడా 21 సంవత్సరాలకు తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ మార్పుల వల్లే దేశంలో అనేక మంది యువ నాయకులకు అవకాశాలు లభించాయని చెప్పారు. యువతకు అవకాశాలు ఇస్తే వారు సమర్థవంతంగా నాయకత్వం వహించగలరని ఉదాహరణలతో వివరించారు.భారత్ జనాభాలో దాదాపు 30 శాతం మంది జెన్-జెడ్ యువత ఉన్నప్పటికీ, 543 మంది సభ్యులున్న లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం ఒక శాతానికి కూడా చేరకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
21 ఏళ్ల వయసులోనే యువత ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో చేరేందుకు అర్హత పొందుతుంటే, అదే వయసులో ప్రజల తీర్పు కోరే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదని ఆయన ప్రశ్నించారు. విద్య, స్టార్టప్‌లు, డిజిటల్ ఎకానమీ, సాంకేతిక రంగాలపై యువతకు ఉన్న అవగాహన ప్రభుత్వ విధానాలకు ఉపయోగపడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో యువత, అనుభవజ్ఞులైన నాయకులు కలిసి పనిచేస్తే సమతుల్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుందని చెప్పారు.అయితే ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతుదారులు యువతకు అవకాశాలు పెరగడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెబుతుండగా, విమర్శకులు మాత్రం రాజకీయ పరిపక్వత, పరిపాలనా అనుభవం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు.ఈ ప్రతిపాదన అమలులోకి రావాలంటే భారత రాజ్యాంగంలో సవరణ అవసరం. ఇందుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా పరిశీలిస్తుంది? రాజకీయ పార్టీలు ఎలాంటి వైఖరి అవలంబిస్తాయి? అనే అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.







