Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న వ్యూహకర్త ఎవరో..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న వ్యూహకర్త ఎవరో..?

 Authored By anusha | The Telugu News | Updated on :5 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న వ్యూహకర్త ఎవరో..?

Telangana Congress : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సునీల్ కొనుగోలు పేరు బాగా వినిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక ఆయన వ్యూహాలు చక్కగా పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడటంతో పాటు సునీల్ వ్యూహాలు కూడా కలిసొచ్చాయని అంటున్నారు. సునీల్ కనుగోలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈయన కర్ణాటకలోని బళ్ళారి లో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. అమెరికాలో ఎంబీఏ చేశారు. అక్కడే ఓ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేశారు. అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ కు సహ వ్యవస్థాపకుడిగా సునీల్ రాజకీయ వ్యూహకర్తగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈ సంస్థ భారతీయ జనతా పార్టీ కోసం వ్యూహాలు రూపొందించింది.  2014లో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడానికి ప్రశాంత్ కిషోర్ తీసుకువచ్చిన సిటిజన్స్ ఫర్ కౌంటబుల్ గవర్నెన్స్ అంటే సిఐజిలోనూ భాగస్వామిగా ఉన్నారు.

బీజేపీతో తన అనుబంధానికి భిన్నంగా సునీల్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహాలు రచించారు. 2022లో కాంగ్రెస్ పార్టీ కీలక ఎన్నికల వ్యూహకర్తగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఈయనను 2024 లోక్సభ పోల్స్ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా సోనియా గాంధీ నియమించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ విభిన్నమైన ఆలోచనలు చక్కని ఇన్పుట్స్ ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో సునీల్ మొదటి వ్యూహకర్తగా చక్కటి విజయాన్ని అందుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి భూమై 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారని కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణల పైన ఓ ప్రచార అస్త్రాన్ని సిద్ధం చేశారు. సామాన్యుడిని మెప్పించేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను సునీల్ బృందం తనదైన శైలిని ప్రదర్శించింది మహిళలకు ఆర్టీసీ బస్సులు, ఉచిత ప్రయాణం గ్యాస్ సబ్సిడీ తదితర ప్రజా ఆకర్ష పథకాల వెనుక సునీల్ ఉన్నారు . కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సునీల్ సలహాదారుడిగా నియమించి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

కర్ణాటక తరహా లోనే కాంగ్రెస్ పార్టీ తరపున హామీలు ఇవ్వడంలో సునీల్ కీలక పాత్ర ఉంది. ఓటర్లను ఆకట్టుకునే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం వెనుక సునీల్ పాత్ర ఉందని ఆ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. కర్ణాటక తరహ వ్యూహాలను తెలంగాణలో అమలు చేయాలని ఆయన సూచించారని చెబుతారు. తెలంగాణలో 500 కి గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 , ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతు భరోసా మొత్తాన్ని 15 వేలకు పెంచడం, కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపు, వ్యవసాయ కార్మికులకు 12 వేల రూపాయలు, వరి పంటలకు ఏడాదికి 500 బోనస్, గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పథకాలతో కాంగ్రెస్ పార్టీ సామాన్యుల మనసులు గెలుచుకునేలా మేనిఫెస్టో రూపొందించడంలో సునీల్ పాత్ర ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది