Telangana : తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది
ప్రధానాంశాలు:
Telangana : తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు “రాజీవ్ యువవికాసం” పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. మొత్తం 5 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకంలో భాగమవుతారు. కార్పొరేషన్‌ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తూ, బ్యాంకుల సహాయంతో రుణాల లింకేజీ కల్పించనున్నారు. ఈ నెల 15న పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.

Telangana government : తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది
ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా 55 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు అని ప్రకటించారు. అర్హులైన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 5 వరకు ఉండగా, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు పరిశీలన చేపట్టనున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం (జూన్ 2) నాటికి అర్హులైన వారికి మంజూరు పత్రాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. పథకం అమలుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో నోటిఫికేషన్‌లో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు డిప్యూటీ సీఎం విమర్శించారు. కార్పొరేషన్‌లకు సరైన నిధులు కేటాయించకపోవడంతో, ఆ వర్గాలకు ప్రయోజనం కలగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి అర్హులైన లబ్ధిదారులకు రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటుంది. ఎంత సబ్సిడీ అందించనున్నదీ త్వరలో స్పష్టత ఇస్తామని తెలిపారు. ఇదే సమావేశంలో, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ. 300 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ యూనివర్సిటీని అద్భుతంగా అభివృద్ధి చేయడంతో పాటు, హెరిటేజ్ భవనాలను పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు.