Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

 Authored By ramu | The Telugu News | Updated on :5 August 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  కాళేశ్వరం కమిటీ ఇచ్చిన అంత ఫేక్..అసలు నిజాలు ఇవే - హరీష్ రావు

  •  కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మొత్తం ట్రాష్ - హరీష్ రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేలెత్తి చూపడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ నివేదికపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. 60 పేజీల నివేదిక కాకుండా, పూర్తి 655 పేజీల నివేదికను అసెంబ్లీలో పెట్టాలని, అప్పుడు తాము దానిని చీల్చి చెండాడతామని ఆయన సవాల్ విసిరారు.

Harish Rao అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడుతాం హ‌రీశ్‌రావు

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : కాళేశ్వరం కమిటీ రిపోర్ట్ పై హరీష్ రావు చిందులు

హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘోష్ కమిషన్ నివేదికపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రిపోర్ట్ మొత్తం ‘ట్రాష్’ లాగా ఉందని ఆయన అభివర్ణించారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చాయని, కానీ అలాంటివి ఏవీ కూడా న్యాయస్థానాల్లో నిలబడలేదని ఆయన గుర్తు చేశారు. ఇందిరా గాంధీ, చంద్రబాబు నాయుడు మీద కూడా కమిషన్లు వేశారని, కానీ అవి కోర్టుల్లో నిలబడలేదని ఉదాహరణగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈ నివేదికను రూపొందించిందని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిపై హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒకవైపు ‘కాళేశ్వరం కూలిపోయింది’ అని చెబుతూనే, మరోవైపు యాదాద్రి జిల్లాకు వెళ్లి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టడం, మల్లన్నసాగర్ నుండి మూసీలోకి నీళ్లు పోయడానికి రూ.6000 కోట్ల టెండర్లు ఖరారు చేయడం ఏంటని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమేనని, కాళేశ్వరం నీళ్లే గంధమల్ల ప్రాజెక్టుకు వెళ్తాయని ఆయన స్పష్టం చేశారు. ‘కాళేశ్వరం కూలిందని అబద్ధపు మాటలు చెప్పి.. గంధమల్లకు కొబ్బరికాయలు కొట్టి, మల్లన్నసాగర్‌కు టెండర్లు ఎలా ఖరారు చేస్తావ్ బిడ్డా రేవంత్ రెడ్డి?’ అంటూ హరీశ్ రావు తీవ్రంగా నిలదీశారు.

మహారాష్ట్రతో కేసీఆర్ చేసుకున్న చారిత్రాత్మక నీటి ఒప్పందాల గురించి కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తాము 152 మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారని, దానికి కేసీఆర్ ఆ విషయం నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి 650 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై చర్చ పెట్టాలని, అప్పుడు నిజాలు ప్రజలకు తెలిసేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్ రావు సవాల్ చేశారు. శాసనసభ వేదికగా తాము ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో చర్చకు పెడతామని ఆయన అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది