Bandi Sanjay : కేసీఆర్ కు మరో మొగుడు రాబోతున్నాడు? బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay : తొలి విడత పాదయాత్రను పూర్తి చేసుకున్న బండి సంజయ్ మాంచి ఊపు మీద ఉన్నారు. పార్టీ అంచనా వేసినంతగా పాదయాత్ర సక్సెస్ కాకున్నా.. ప్లాప్ షో మాత్రం కాకపోవటం ఊరటను ఇచ్చిందన్న మాట బీజేపీ వర్గాల నోట వినిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతల్లో హుషారు పుట్టించేలా.. అధికారపక్షం డిఫెన్సులో పడేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ ను గెలిపించాలన్నారు. ఈటల రాజేందర్ తో లబ్థి పొందిన టీఆర్ఎస్ నేతలు చివరకు ఈటల రాజేందర్ ను వదిలించుకున్నారని..
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిందేమీ లేదన్న బండి సంజయ్.. ”ఒకవేళ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేస్తారా?” అని సూటి సవాల్ ను సంధించారు. ఈటల రాజేందర్ ను గెలిపించాలన్న బండి సంజయ్.. ఈ సందర్భంగా మరో ఆసక్తికర ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో ”ఆర్ఆర్ఆర్” ప్రజాగళాన్ని వినిపిస్తారన్న బండి సంజయ్ మాట సభకు వచ్చిన వారిలో హుషారు పెంచేలా చేసింది. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరెన్సీని గెలిపిస్తారా? బీజేపీ కాషాయం జెండాను గెలిపిస్తారా? అని ప్రశ్నించారు బండి సంజయ్. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈటల రాజేందర్ విజయం సాధించడం ఖాయమని అసెంబ్లీలో అడుగు పెడతారని అన్నారు.
Bandi Sanjay కేసీఆర్ కు ఆర్ఆర్ఆర్ చుక్కలే..
హుజూరాబాద్‌లో రాజేందర్ గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ ప్రజాగళం వినిపిస్తారని బండి సంజయ్ చెప్పారు. రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్‌లు ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడతారని తెలిపారు. మరోవైపు, మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణను పాలించే నైతిక హక్కును కేసీఆర్ ఎప్పుడో కోల్పోయారని ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని.. లేదంటే కేసీఆర్ రాజీనామా చేయాలని సవాల్ చేశారు.
హుజురాబాద్‌లో నన్ను ఓడించేందుకు ఆరుగురు మంత్రులు, పదుల కొద్దీ ఎమ్మెల్యేలు ఐదు నెలలుగా కుట్రలు పన్నుతున్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి నన్ను ఓడించి.. మరో 20 ఏళ్లు తెలంగాణను బానిసత్వంలో ముంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. కేసీఆర్.. నీకు దమ్ముంటే లిక్కర్, డబ్బులు పంచకుండా గెలువు. నీ పార్టీకి ఇక్కడ డిపాజిట్ కూడా రాదు. అక్టోబర్ 30న టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలె అంటూ ఈటల రాజేందర్ ప్రజలను కోరారు.