Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ వ్యూహం మామూలుగా లేదు.. అందుకే అతడిని బరిలోకి దింపారా?
Huzurabad bypoll తెలంగాణలో రాజకీయ కాక పుట్టిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల సందడి మరో స్థాయికి చేరింది. నామినేషన్లు ప్రచారంతో అభ్యర్థులు సందడి చేస్తున్నారు. ఇక ఈ ఎన్నిక విషయంలో చాలా కాలం పాటు స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్.. ఎట్టకేలకు తమ అభ్యర్థిని ప్రకటించి పోటీలో దిగుతున్నామనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇన్ని రోజుల సరైన అభ్యర్ధి కోసం తంటాలు పడ్డ కాంగ్రెస్.. వేచి చూసే ధోరణి అవలంబించింది. ఇక నోటిఫికేషన్ కూడా విడుదల కావడం ఈ నెలలోనే ఎన్నిక ఉండడంతో విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్ నర్సింగరావును అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్తున్న వెంకట్ కు అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Huzurabad bypoll గెల్లుకు అండగా అధికారపార్టీ..
రాజకీయాల్లో ప్రత్యర్థిని ఢీ కొట్టాలంటే ముందు మనం బలంగా ఉండాలి. కానీ హుజూరాబాద్లో వెంకట్ తలపడే ప్రత్యర్థులే అతని కంటే ఎన్నో రెట్లు బలంగా ఉన్నారు. పైగా వాళ్లకు ఆ నియోజకవర్గంలో మంచి పట్టుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ఇక ఈ ఎన్నికలో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. రాజకీయంగా పెద్ద పేరు లేనప్పటికీ.. టీఆర్ఎస్ విజయం కోసం ఇప్పటికే ఆ నియోజకవర్గంలో మంత్రులు పాగా వేశారు. అధికార పార్టీ అండదండలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఉన్నాయి.
Huzurabad bypoll వచ్చే ఎన్నికలకోసమేనా..
ఈ నేపథ్యంలో ప్రధాన పోటీ బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే ఉండనుంది. ఈ రెండు పార్టీలను ఎదుర్కోవడం కాంగ్రెస్ కు కష్టమే. అలాంటి పరిస్థితుల్లో బల్మూరి వెంకట్ పేరును ఖరారు చేయడం వెనక కాంగ్రెస్ వ్యూహం వేరే ఉందని అర్థమవుతోంది. ఓటమి ముందే తెలిసినా.. పోటీ చేయకపోతే పరువు పోతుందని భావించిన కాంగ్రెస్.. వెంట్రుకతో కొండను లాగుదామనే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓడిపోతే పెద్దగా ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ గెలిస్తే మాత్రం అది సంచలనమే. ఈ నేపథ్యంలో బల్మూరి కాంగ్రెస్ వ్యూహానికి బలంగా మారతారా? లేదా బలవుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.