JanaSena Party : విడివిడిగా బీజేపీ, జనసేన.. అసలు పొత్తు ఉందా ? లేదా?
JanaSena Party : బీజేపీతో పొత్తులో ఉన్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ అప్పట్లో చెప్పిన సంగతి అందరికీ విదితమే. బీజేపీ-జనసేన ఉమ్మడిగా ఏపీలో అధికారంలోకి రాబోతున్నాయని బీజేపీ నేతలు చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు అసలు ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.పొత్తు ధర్మాన్ని బీజేపీ, జనసేన పాటించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో తాము పోటీలో ఉండబోమంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ విషయమై బీజేపీతో సంప్రదించలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
అయితే, బీజేపీ మాత్రం తాము బరిలో ఉంటామని అంటోంది. ఇకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాలు గెలుచుకుంది. అయితే, ఈ విషయమై పొత్తులో ఉన్న తమకు చెప్పలేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. దానికి సమాధానంగా జనసేన రాష్ట్రనాయకత్వం స్పందిస్తూ తమకు కూడా తెలియకుండా పొత్తులు స్థానిక నేతలు పెట్టుకున్నారని చెప్పింది. ఉభయ గోదావరి జిల్లాలో ఉండే బీజేపీ స్టేట్ చీఫ్‌కు తెలియకుండానే ఇదంతా జరగడం గమనార్హం. ఇకపోతే బీజేపీ సైతం పొత్తు ధర్మం పాటించడం లేదు. జనసేనను భాగస్వామి చేయకుండానే కార్యక్రమాలు రూపొందిస్తోంది. అయితే, జనసేన మొదలు బీజేపీని సంప్రదించకుండా అక్టోబర్ 2న రోడ్ల మరమ్ముతు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
JanaSena Party : పొత్తు ఉండేనా..? ఊడేనా?
ఈ క్రమంలోనే బీజేపీ సైతం జనసేనను సంప్రదించకుండానే మత్స్య గర్జన కార్యక్రమం చేపట్టి సొంతంగా నిర్వహించుకుంది. జనసేనతో కలిసి నడిచే కన్న సొంతంగానే బలపడాలని కమలనాథులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాము కూడా సొంతంగా ఎదగగలమని, బీజేపీ అవసరం లేకుండానే అధికారంలోకి రాగలమని జనసేన భావిస్తున్నట్లు సమాచారం. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఏపీ ప్రభుత్వంపైన, వైసీపీ మంత్రులపైన గతంతో పోల్చితే స్వరం పెంచారు. వరుస సభల్లో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కేడర్‌ను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. చూడాలి మరి.. ఎన్నికల వరకు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందో.. ఉండదో…