Electricity bills : తెలంగాణ ప్రజలపై పడనున్న మరో పిడుగు.. విద్యుత్ ఛార్జిలు యూనిట్‌కు రూ.1 పెంపు..?
Electricity bills : తెలంగాణ ప్రజల నెత్తిన రాష్ట్ర సర్కార్ మరో పిడుగు వేయనున్నట్టు తెలుస్తోంది. డిస్కంలు తమ నష్టాలను తగ్గించేందుకు విద్యుత్ చార్జీలను తప్పకుండా పెంచాలని సర్కార్‌కు ప్రతిపాదనలు పంపింది. యూనిట్‌కు రూ.1 పెంచితే గానీ నష్టాల నుంచి తాము బయట పడలేమని తేల్చిచెప్పాయి. గత ఐదేళ్లుగా చార్జీలు పెంచనందున నష్టాలతో పాటు ఆర్థిక లోటు కూడా పెరిగిపోయిందని విద్యుత్ డిస్కంలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి.
యూనిట్‌కు 5-10 పైసలు పెంచితే ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరవని తెలిపాయట.. ప్రస్తుత, వచ్చే ఏడాది కలుపుకుని రూ.21,552 కోట్ల మేర ఆర్థిక లోటు ఉంటుందని డిస్కంలు ప్రభుత్వానికి, ఈఆర్‌సీ స్పష్టంచేశాయి. ఇవే కాకుండా ఏటా రూ.6 వేల కోట్ల నష్టాలు వస్తున్నట్టు సమాచారం. ఏటా సగటున 4 వేల కోట్ల యూనిట్ల పవర్‌ను డిస్కంలు ప్రజలకు అమ్ముతున్నాయి. యూనిట్‌కు 1 రూపాయి పెంచితే ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుత ఛార్జీలనే కొనసాగిస్తే వచ్చే ఏడాది (2022-23) రూ.10,928 కోట్లు లోటు ఉంటుందని తెలిపాయి. అయితే, యూనిట్‌కు రూపాయి పెంచిన రూ.6,928 కోట్లు ఆర్థిక లోటు మాత్రం కొనసాగుతుందని డిస్కంలు అంచనా వేశాయి.
Electricity bills : యూనిట్‌కు రూ.1 ధర పెంపు తప్పదా..
యూనిట్‌కు రూ.1 చొప్పున పెంచేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదం పొందాక ఈఆర్‌సీకి ఇవ్వాలని డిస్కంలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే, వారం రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలని డిస్కంలను ఈఆర్‌సీ గురువారం ఆదేశించింది. వచ్చే ఏడాది (2022-23)కు వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్) నివేదికను ఇటీవల డిస్కంలు మండలికి అందించినా చార్జిల పెంపు ప్రతిపాదనలు మాత్రం ఇవ్వలేదట.
వచ్చే ఆర్థిక ఏడాది ఏప్రిల్ 1 నుంచి కరెంటు చార్జిలు పెంచాలంటే నవంబరు 30కల్లా ప్రతిపాదనలు ఇవ్వాల్సి ఉండగా.. వీటిపై తుది తీర్పు వెలువడటానికి కనీసం 120 రోజుల సమయం పడుతుందని ఈఆర్‌సీ తెలిపింది. అసలు ఛార్జీలపై ఇప్పటివరకు ప్రపోసల్స్ రాకపోవడంతో ఆ నివేదిక పనికిరాదని, దానిని ప్రజల ముందు కూడా ఉంచలేమని మండలి ఛైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారట.. దీంతో ఈఆర్‌సీ ఆదేశాలతో ఛార్జీల పెంపుపై డిస్కంలు గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి.