Brahmamudi 6 Nov Today Episode : స్వప్నతో పాటు కావ్యను కూడా ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం అన్న అపర్ణ.. కావ్యకు రాజ్ విడాకులు.. కావ్య జీవితం నాశనం చేసిన స్వప్న | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmamudi 6 Nov Today Episode : స్వప్నతో పాటు కావ్యను కూడా ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం అన్న అపర్ణ.. కావ్యకు రాజ్ విడాకులు.. కావ్య జీవితం నాశనం చేసిన స్వప్న

 Authored By gatla | The Telugu News | Updated on :6 November 2023,9:30 am

ప్రధానాంశాలు:

  •  కనకాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన స్వప్న

  •  కనకానికి ఫోన్ చేసిన స్వప్న

  •  కావ్యను కూడా ఇంట్లో నుంచి పంపించేద్దాం అన్న అపర్ణ

Brahmamudi 6 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 6 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 246 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వప్న అంటూ కనకం తన దగ్గరికి వస్తుంది. మళ్లీ వచ్చావేంటమ్మా అంటుంది స్వప్న. దీంతో చేసిన పనికి సిగ్గు పడాల్సింది పోయి రంగులు వేసుకుంటున్నావా? నిన్ను కొట్టడం కాదు చంపేయాలి అంటుంది కనకం. అంత తప్పు నేనేం చేశాను అంటే.. లేని కడుపు ఉందని నాటకం ఆడి ఇప్పుడు కావ్యను ఇరికిస్తావా అంటూ సీరియస్ అవుతుంది కనకం. నిన్ను ఇలా కాదు అంటూ చీపిరితో వాయిస్తుంది. నువ్వేదో పెద్ద నీతిమంతురాలిలా నన్ను కొడుతున్నావు. అంత దాకా వస్తే నన్ను కాదు. నిన్ను నువ్వే కొట్టుకో. అసలు తప్పు చేసింది నువ్వు అంటుంది స్వప్న. దీంతో ఏంటి నేను తప్పు చేశానా? ఇప్పటి వరకు నింద కావ్య మీద వేశావు. ఇప్పుడు నా మీద వేస్తున్నావా అంటుంది కనకం. దీంతో నేను నిజమే చెబుతున్నా. ఇదంతా నీవల్లనే జరిగింది. నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి డబ్బున్న వాళ్లలాగానే ప్రవర్తించేలా చేశావు. నన్ను డబ్బున్న కోడలిగా చేస్తానని చెప్పింది నువ్వు కాదా? ఈ ఇంటికి తీసుకొచ్చి నాకు నాట్యం రాకపోయినా ఇక్కడ ఉంచింది నువ్వు కాదా. చేసిన తప్పులు అన్నీ నువ్వు చేసి ఇప్పుడు నీతులు చెప్పడానికి వచ్చవా? ఆరోజు నువ్వు అంత పెద్ద నాటకం ఆడకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత పెద్ద నాటకం ఆడాల్సి వచ్చేదే కాదు కదా అంటుంది స్వప్న.

ఇప్పటికీ నీ స్వార్థం నువ్వు చూసుకోవడానికే వచ్చావు. నీ చిన్నకూతురు ఈ ఇంటి పెద్దకొడుకు భార్య కాబట్టి తన కాపురం బాగుండాలని వచ్చావు అంతే కదా అంటుంది. నువ్వు నా మీద సవితి ప్రేమ చూపించావు అంటే.. నీ మీద కాదే.. కావ్య మీద చూపించాను అంటుంది కనకం. నేను నాటకం ఆడానా? ఎవరి కోసం ఆడాను. నా కోసం ఆడానా? నీ కోసం ఆడాను. నువ్వు సంతోషంగా ఉండాలని ఆడాను. నాలా నువ్వు ఉండకూడదనే నేను ఇలా చేశాను. కానీ.. నీ స్వార్థం కోసం నువ్వు నీ దారి నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు కూడా నీ స్వార్థంతో కావ్య జీవితాన్ని నాశనం చేస్తున్నావు అంటే.. కావ్యనే కాదు నా దారికి ఎవరు అడ్డు వచ్చినా ఇలాగే చేస్తాను. ఆఖరికి అది నువ్వు అయినా సరే అంటుంది స్వప్న. నువ్వే కదా అన్నావు నా వల్ల ఇలా అయ్యాను అని. నువ్వు ఏమైనా చేసుకో. కానీ.. కావ్యను వదిలేయ్ అంటుంది స్వప్న. కానీ.. వినదు. నువ్వు మారవు. ఇక్కడ నిన్ను ఉంచలేను. పదా వెళ్దాం అంటే.. నేను రాను అంటుంది స్వప్న. ఇది నా ఇల్లు. నా మొగుడి ఇల్లు. నేను ఎక్కడికీ రాను. ఇంకోసారి నా జీవితంలోకి రాకు. వచ్చి నీ పరువు తీసుకోకు. వెళ్లు అని చెప్పి తల్లిని బయటికి నెట్టేస్తుంది స్వప్న.

Brahmamudi 6 Nov Today Episode : కావ్యను చూసి కూడా మాట్లాడుకుండా వెళ్లిపోయిన కనకం

దీంతో ఏం చేయాలో అర్థం కాదు కనకానికి. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా కావ్య చూస్తుంది. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు. నేను చూడనేలేదు అంటుంది కావ్య. కానీ.. ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోతుంది కనకం. ఇంటికి తిరిగి వస్తుంది కనకం. వద్దు అన్నా కూడా ఎందుకు వాళ్ల ఇంటికి వెళ్లావు అంటే.. స్వప్న కోసం వెళ్లాను అంటుంది కనకం. స్వప్న ఆ ఇంట్లో ఉన్నంత వరకు కావ్యకు కష్టాలు, కన్నీళ్లు తప్పవని స్వప్నను తీసుకొద్దామని వెళ్లాను అంటుంది కనకం. తీసుకొచ్చి ఏం చేస్తావు అంటాడు కృష్ణమూర్తి.

అసలు అక్కడ ఏం జరిగింది కనకం. మళ్లీ ఏదైనా గొడవ జరిగిందా? అని అడుగుతాడు కృష్ణమూర్తి. నన్ను గదిలో నుంచి బయటికి తోచి మొహం మీద తలుపు వేసింది అంటుంది కనకం. అంత జరిగితే నువ్వేం చేస్తున్నావు. బయటికి లాక్కు రావాల్సింది అంటుంది అప్పు. తన జీవితంలో తల్లిగా నా పాత్ర అయిపోయింది అని చెప్పాక ఏం చేసి ఏం లాభం అంటుంది కనకం. ఇప్పుడే వెళ్లి దాన్ని ఈడ్చుకొస్తాను అంటుంది అప్పు. దీంతో వద్దు అంటుంది కనకం. మనం చేయడానికి అక్కడ ఏం లేదు అప్పు. నువ్వు వెళ్లడం వల్ల అక్కడ గొడవ జరుగుతుంది తప్ప ఆ స్వప్నలో ఏం మార్పు రాదు అంటుంది కనకం.

కూతురు కష్టపడుతున్నా చూస్తూ మౌనంగా ఉండాలి తప్పితే నోరెత్తి అడగకూడదు. ఎందుకు అని ప్రశ్నించకూడదు. ఆచారాల పేరుతో మా నుదుటి రాత అలా రాశాక.. ఏడ్వడం తప్ప ఇంకేం చేయగలం అని చెప్పి లోపలికి వెళ్తుంది కనకం. ఏంటి నాన్నా ఇది అంటుంది అప్పు. మరోవైపు కనకానికి కావ్య ఫోన్ చేస్తుంది. కావ్య చెప్పమ్మా అంటే నేను కాదమ్మా నువ్వే చెప్పాలి అంటుంది.

ఎందుకు వచ్చావు.. ఎందుకు వెళ్లావు అంటే.. ఏం మీ ఇంటికి నేను రాకూడదా? అంటే రావచ్చు కానీ.. ఎందుకు అంత బాధపడుతూ వెళ్లావు అంటుంది కావ్య. నేను స్వప్నతో మాట్లాడటానికి వచ్చాను. అది చేసే పనుల వల్ల నీకేం ఇబ్బంది రాకూడదని చెప్పాను అంతే అంటుంది కనకం. ఇంట్లో అందరూ నీతో బాగుంటున్నారా అని అడుగుతుంది కనకం. దీంతో తప్పు జరిగిపోయింది. ఎవరు మాత్రం ఏం చేస్తారు. జరిగేదాన్ని ఎదుర్కోక తప్పదు అంటుంది కావ్య.

నీ బాధ నాకు అర్థం అవుతోంది అపర్ణ. కానీ నేను చెప్పేది కూడా ఒకసారి ఆలోచించు అంటుంది ఇందిరాదేవి. నేను అస్సలు ఆగను అంటుంది అపర్ణ. స్వప్న చేసిన పనికి మనం కావ్యను శిక్షించడం కరెక్ట్ కాదు అంటుంది ధాన్యలక్ష్మి. కావ్యకు పెద్దలంటే గౌరవం. ఇంట్లో కోడలుగా చేయాల్సిన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించింది. ఎంత పని ఉన్నా.. ఎవ్వరు విసిగించినా నవ్వుతూనే ఉంటుంది అని కావ్య గురించి చెబుతారు.

దీంతో నేను తప్పు చేసింది అంటే కావ్య గురించి గొప్పలు చెబుతారేంటి అంటుంది. మరోవైపు రాజ్.. కావ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. కావ్యపై స్వప్న వేసిన నింద నిజమే అనుకొని బాధపడతాడు రాజ్. కావ్య ఇంత మోసం చేస్తుందా అని అనుకుంటాడు. అక్కడ టేబుల్ మీద ఉన్న పెళ్లి ఫోటోను చించేస్తాడు రాజ్. ఇంతలో కావ్య రూమ్ లోకి వస్తుంది. తన ఫోటోను కాల్చేయడం చూసి షాక్ అవుతుంది.

ఇంతలో తన చేయి కాలుతుంది. ఏమండి.. ఏమైంది అని అడుగుతుంది. ఏం కాలేదు.. నువ్వు అబద్ధం చెప్పిన దానికంటే ఈ బాధ ఏం ఎక్కువ కాదు అంటాడు రాజ్. రేపు ఉదయం తాతయ్య నీ విషయం తేల్చేస్తే ఆ దూరం శాశ్వతంగా ఉండిపోతుంది అంటాడు రాజ్. పైన దేవుడు ఉన్నాడు. ఆ నిజాలు దేవుడికే తెలుసు. నేను తప్పు చేయలేదని తెలుసు. తప్పు చేయని వాళ్లకు శిక్ష వేయకూడదని తెలుసు అంటుంది కావ్య.

నువ్వు దేవుడికి కూడా అబద్ధాలు చెప్పగలవు. కానీ.. నేను మనిషిని. నేను అబద్ధాలు తట్టుకోలేను. రేపటితో ఈ బంధానికి పుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజ్. దీంతో కావ్యకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు స్వప్న పాత్ర ఎంత ఉందో.. ఇందులో కావ్య హస్తం కూడా అంతే ఉంది అని చెబుతుంది అపర్ణ. ఇంతదాకా వచ్చాక స్వప్నతో పాటు కావ్యను కూడా పంపించేద్దాం. రాజ్ కు విడాకులు ఇప్పిద్దాం అంటుంది అపర్ణ. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది