Vangalapudi Anitha : అప్పుడు టీచర్.. ఇప్పుడు హోంమంత్రి.. వంగలపూడి అనిత ప్రస్థానం ఇలా సాగింది..!
ప్రధానాంశాలు:
Vangalapudi Anitha : అప్పుడు టీచర్.. ఇప్పుడు హోంమంత్రి.. వంగలపూడి అనిత ప్రస్థానం ఇలా సాగింది..!
Vangalapudi Anitha : కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలు హెడ్ లైన్స్‌లో నిలుస్తూ ఉండడం మనం చూశాం. ఎట్టకేలకి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మనం చూశాం. ఇక చంద్రబాబుతో పాటు, మరో 24 మంది కూటమి నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శుక్రవారం వివిధ శాఖలను కూడా కేటాయించారు. ఈనేపథ్యంలో ఏపీ హోమ్ మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఆమె గతంలో వైసీపీ నేతలని చీల్చి చెండాడింది. ముఖ్యంగా రోజాని ఓ రేంజ్ లో ఏకి పారేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు అనిత.
Vangalapudi Anitha టీచర్ టూ హోం మినిస్టర్..
వంగలపూడి అనిత రాజకీయాల్లో రాకముందు ప్రభుత్వ టీచర్ గా పని చేశారు. అయితే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె… 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ హోంశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. 1984లో విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు అనిత. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ. ఎంఈడీ పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2014లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావు పై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో అనిత పోటీ చేసే స్థానం మారింది. పార్టీ ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి పాయకరావుపేట నియోజకవర్గం కేంద్రంగా మళ్లీ అనిత యాక్టివ్ అయ్యారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తూ… ముందుకెళ్లారు.
పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా అనితకు అవకాశం వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడటంతో అనిత ముందున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురైనప్పటికీ అనిత వెనక్కి తగ్గలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి అనిత టికెట్ దక్కించుకున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వంగలపూడి అనిత…వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై 43,727 ఓట్ల తేడాలో విక్టరీ కొట్టారు.కాగా, 2019 ఎన్నికల్లో అనితపై గెలిచిన వైసీపీ అభ్యర్థి తానేటి వనిత కూడా జగన్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా అవకాశం దక్కించుకోవడం కొసమెరుపు.